
మాయాజాలం
ఇంజినీరింగ్
● తమ వారికే టెండర్లు దక్కేలా ప్రణాళికలు ● టెండర్లలో పాల్గొనొద్దంటూ కాంట్రాక్టర్లకు బెదిరింపులు ● ‘ది డెక్’ నిర్వహణకు సింగిల్ టెండర్.. అయినా అప్పగించేందుకు ప్లాన్ ● ఇప్పటికే జనసేన మహిళా నేతకు కీలక కాంట్రాక్టులు అప్పగింత ● సీ హారియర్ నిర్వహణలో తక్కువకు టెండర్ వేసిన వారిని తప్పుకోవాలంటూ ఫోన్లు
విశాఖ సిటీ: విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఇంజినీరింగ్ అధికారుల వ్యవహారశైలి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. తమ వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఫోన్లు చేసి మరీ కాంట్రాక్టర్ల ను బెదిరించారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. టెండర్‌లో పాల్గొనవద్దని ఒకరికి, టెండర్ దక్కించుకున్నా కూడా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా మరొకరికి ఇబ్బందులు కలిగిస్తున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ భవన నిర్వహణకు సంబంధించి సింగిల్ టెండర్ వచ్చేలా ప్రయత్నాలు చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా సదరు టెండర్‌దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఫోన్లు చేసి బెదిరింపులు
వీఎంఆర్‌డీఏ ఇటీవల సీ హారియర్, ది డెక్ (మల్టీ లెవెల్ కార్ పార్కింగ్) వార్షిక నిర్వహణకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో ఒక ఇంజినీరింగ్ అధికారి రింగ్ మాస్టర్‌గా మారినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ టెండర్లను దక్కించుకోవడానికి కాంట్రాక్టర్ల మధ్య పోటీ నెలకొన్నప్పటికీ, సదరు అధికారులు తమ వారికి ఈ కాంట్రాక్టులను కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తూ కాంట్రాక్టర్లను బెదిరించినట్లు విభాగంలోని సిబ్బంది అంతర్గతంగా చర్చించుకుం టున్నారు. బీచ్ రోడ్డులో ఉన్న సీ హారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం నిర్వహణకు 11 నెలలకు గాను రూ.35.05 లక్షల అంచనా వ్యయంతో వీఎంఆర్‌డీఏ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గత నెల 17వ తేదీతో టెండర్ల సమర్పణకు గడువు ముగిసింది. అయితే ఈ టెండర్‌లో పాల్గొనవద్దని ఒక కాంట్రాక్టర్‌కు ఫోన్ వచ్చిందట. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ వేరే సంస్థ పేరుతో టెండర్ వేశారు. మొత్తంగా ఈ పనుల కోసం నలుగురు కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొన్నారు. ఇందులో అత్యల్పంగా 15 శాతం తక్కువకు రూ. 29,48,036కు ఒకరు టెండర్ వేయగా, ఆ తరువాత 9.09 శాతం తక్కువకు రూ.31,86,753కు మరో కాంట్రాక్టు సంస్థ దాఖలు చేసింది. తక్కువకు టెండర్ వేసిన సంస్థకు కాకుండా రెండో స్థానంలో ఉన్న సంస్థకు టెండర్ పనులను అప్పగించేందుకు ఇంజనీరింగ్ అధికారి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ టెండర్‌ను వదులుకోవాలని తక్కువ బిడ్ చేసిన కాంట్రాక్టర్‌కు చెప్పినట్లు సమాచారం. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో అప్పటి నుంచి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
వీఎంఆర్‌డీఏలో బరితెగిస్తున్న అధికారులు
సింగిల్ టెండర్.. అయినా ఓకే..!
సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ నిర్వహణకు 11 నెలలకు గాను రూ.1,33,48,537కు టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్‌లో పాల్గొనేందుకు పలువురు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపారు. అయితే, ఈ ఇంజినీరింగ్ అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి, జనసేనకు చెందిన ఒక మహిళా నేతకు ఈ పనులు అప్పగించేందుకు ఒక కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి టెండర్‌లో పాల్గొనవద్దని చెప్పినట్లు సమాచారం. ఆ కాంట్రాక్టర్‌కు ఇప్పటికే వీఎంఆర్‌డీఏలో రూ. కోటి వరకు బిల్లు పెండింగ్‌లో ఉండగా, ఆ బిల్లు కావాలంటే ఈ టెండర్‌కు దూరంగా ఉండాలని బెదిరించినట్లు సిబ్బంది అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేయలేదు. ఈ నెల 8వ తేదీతో టెండర్ సమర్పణకు గడువు ముగిసింది. ఆశ్చర్యకరంగా, కేవలం ఒకరు మాత్రమే బిడ్ వేశారు. నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్‌ను తిరస్కరించాల్సి ఉండగా, సదరు ఇంజనీరింగ్ అధికారి మాత్రం ఆ సింగిల్ టెండర్‌దారునికే పనులు అప్పగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

మాయాజాలం