
పర్యాటక ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష
మహారాణిపేట: జిల్లాలోని పర్యాటక ప్రాజెక్టుల స్థితిగతులు, ఔత్సాహిక కంపెనీలకు భూ కేటాయింపులు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలపై రాష్ట్ర పర్యాటక, గృహనిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా అధికారులతో చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ కేటాయింపులు చేయాలని ఆదేశించారు. అలాగే పర్యాటక శాఖకు అశోక్ లేల్యాండ్, పోర్ట్‌లు అందిస్తున్న డబుల్ డెక్కర్ బస్సుల కోసం చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం, జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించి, నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె. మాధవి, గృహనిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.