
జిల్లాలో 10 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
మహారాణిపేట: గ్రీన్ విశాఖ మిషన్‌లో భాగంగా జిల్లాలో పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. గురువారం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీఎంఆర్‌డీఏ ద్వారా లక్ష మొక్కలు, జీవీఎంసీ 2.50 లక్షలు, అటవీ శాఖ 84 వేలు, డూమా 60 వేలు, పరిశ్రమల శాఖ 50 వేలు, విశాఖ పోర్టు 25 వేలు, విద్యాశాఖ 12 వేలు, ఇతర శాఖల ద్వారా 4.28 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 6 నుంచి వివిధ దశల్లో ఈ మొక్కల్ని నాటేలా ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డూమా పీడీ ఆర్.పూర్ణిమాదేవి, డీఎఫ్‌వో మంగమ్మ, జీవీఎంసి హార్టికల్చర్ డీడీ దామోదర్, వీఎంఆర్‌డీఏ డీఎఫ్‌వో శివాని, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆదిశేషు, పోర్టు హార్టికల్చర్ అధికారి రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు.