
అంకితభావంతో ‘స్వచ్ఛాంధ్ర’ నిర్వహించాలి
మహారాణిపేట: ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను అంకితభావంతో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై బుధవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కులు, బస్, రైల్వే స్టేషన్లు, వసతి గృహాలు, ఆసుపత్రులు తదితర ప్రాంతాల్లో ఈ నెల మూడో శనివారం స్వచ్ఛందంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. వేసవిలో వడగాలుల నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా, పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్మికులు, వీధి వ్యాపారులు, చిన్న పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. టెర్రస్ గార్డెనింగ్, తడిపొడి చెత్త నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల వినియోగం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో సీఎంవో నరేష్‌కుమార్, డిపివో శ్రీనివాసరావు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.