ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం

May 15 2025 12:42 AM | Updated on May 15 2025 12:49 AM

ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం

ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రం

సీతంపేట: రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ(ఉపాధ్యాయ నియామక పరీక్ష)ను ఒకే రోజు ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా డీఎస్సీలో ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు, విధానాలు తమ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయని వాపోతున్నారు.

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీతో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూన్‌లో సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసినప్పటికీ.. 10 నెలల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కేవలం 16,347 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదల చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 50 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ వస్తుందని ఆశించిన వారికి ఇది శరాఘాతంగా మారింది.

సమాన అవకాశాలకు విఘాతం

ప్రభుత్వం తాజాగా డీఎస్సీ పరీక్షలను జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు నెల రోజుల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించడం అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విధానం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వారు పేర్కొంటున్నారు. నెల రోజుల పాటు జరిగే పరీక్షల్లో ప్రతి రోజూ వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఉంటాయని.. దీని వల్ల ఏ రోజు పేపర్‌ కష్టంగా వస్తుందో.. ఏ రోజు సులువుగా వస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. కష్టమైన ప్రశ్నాపత్రం వచ్చిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మొదటి రోజుల్లో పరీక్ష రాసే అభ్యర్థులు తదుపరి రోజుల్లో ప్రిపరేషన్‌కు సమయం కోల్పోతారని, ఇది సమాన అవకాశాలకు విఘాతమని వాపోతున్నారు. గతంలో మాదిరిగా రాష్ట్రమంతటా ఒకే రోజు.. ఒకే ప్రశ్నాపత్రంతో ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

రాష్ట్రమంతా ఒకే రోజు డీఎస్సీ నిర్వహించాలని అభ్యర్థుల డిమాండ్‌

నెల రోజులు నిర్వహిస్తే ప్రిపరేషన్‌సమయాన్ని కోల్పోతామని ఆవేదన

స్పెషల్‌ డీఎస్సీ పోస్టులు కూడా భర్తీ చేయాలని డిమాండ్‌

వయో పరిమితి పెంచాలి

గత ఏడేళ్లుగా డీఎస్సీ నియామకాలు లేకపోవడంతో వయోపరిమితి దాటిపోయిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా చెవిటి, మూగ, అంధ విద్యార్థులకు బోధించే 2,600 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో చేర్చకపోవడంపై స్పెషల్‌ బీఈడీ, డైట్‌ చదివిన లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ నూతన డీఎస్సీ విధానాలు, నిబంధనలు తమ ఆశలపై నీళ్లు చల్లడమే కాకుండా, తమ భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణలోకి తీసుకుని.. ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని, వయోపరిమితిని పెంచాలని, ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement