
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 31 కోట్లు కేటాయించామని, ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీలో మూడు ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టనున్నామని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మురుగునీటి సమస్య పరిష్కారానికి ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్కో ఇంకుడు గుంతకు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని ఆమె వివరించారు. సమావేశంలో సామాజిక పింఛన్లు, గ్రామీణాభివృద్ధి పనులపై చర్చించారు. ఏజెన్సీ ప్రాంతంలో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని, 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సభ్యులు కోరారు. దీనిపై చైర్‌పర్సన్ తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.