
అర్జీల రీ ఓపెన్‌పై అసంతృప్తి
● పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశం ● ‘పీజీఆర్‌ఎస్’లో 208 వినతుల స్వీకరణ
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో నమోదైన అర్జీలు తరచూ పునరావృతం అవుతుండటంపై కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ఆయన వినతులపై సమీక్షించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను 24 గంటలలోపు తెరిచి, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి.. సమస్య పూర్వాపరాలు తెలుసుకుని సరైన పరిష్కారం అందించాలని స్పష్టం చేశారు. అర్జీలు పునరావృతం అయితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి వచ్చే అర్జీలకు, ముఖ్యంగా భూసర్వే, రెవెన్యూ, జీవీఎంసీలకు సంబంధించిన వాటికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి తక్షణమే పరిష్కరించాలన్నారు. అనంతరం కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ వర్మ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 208 వినతులు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు 80, పోలీసు శాఖకు 19, జీవీఎంసీకి 52, ఇతర విభాగాలకు 57 అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల స్థితిని తెలుసుకోవడానికి లేదా కొత్త ఫిర్యాదులు నమోదు చేయడానికి 1100 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అలాగే పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 120 వినతులు వచ్చినట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు.