
అమరావతిలోనే అభివృద్ధి కేంద్రీకరణ
● మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా.. ● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్
అల్లిపురం : కూటమి ప్రభుత్వం అమరావతినే అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలను విస్మరించడాన్ని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి తప్పుపట్టారు. అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమరావతి కోసం ఇప్పటికే 40 వేల ఎకరాలు సేకరించారని, మరో 40 వేల ఎకరాలు సేకరిస్తున్నారని, అక్కడ ప్రభుత్వం చేస్తున్న భూ కేటాయింపులకు అర్థం లేదని విమర్శించారు. గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తుండగా అక్కడకు దగ్గరలోని అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 వేల ఎకరాలు కేటాయించడాన్ని తప్పుపట్టారు. అమరావతిలో రైల్వే స్టేషన్ కోసం 2,600 ఎకరాలు కేటాయించారని, దేశంలో ఏ రైల్వే స్టేషన్ చూసినా వంద ఎకరాలలోపే ఉన్నాయన్నారు. విశాఖ కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పి అమరావతిలో ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుని, ఎకరం 99 పైసలకు భూములను కేటాయించారన్నారు. టీసీఎస్ ఎప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తుందో తెలియదన్నారు. విశాఖలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు భూములు కేటాయించారని, అక్కడ మౌలిక సదుపాయాల కోసం భారీగా నిధులు ఖర్చు చేశారని, ఇప్పటి వరకు ఆ సంస్థ పునాదిరాయి కూడా వేయలేదని విమర్శించారు. 2026లో భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమవుతాయని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించినప్పటికీ, విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ రహదారులను ఇప్పటి వరకు అభివృద్ధి చేయలేదన్నారు. విశాఖ మెట్రో కారిడార్ పై కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన లేదని అన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
జిల్లా కార్యవర్గం, నూతన సమితి ఎన్నిక
జిల్లా కార్యదర్శిగా ఎస్.కె.రెహమాన్, జిల్లా సహాయ కార్యదర్శిగా కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఎం.పైడిరాజు, కె.సత్యాంజనేయ, ఆర్.శ్రీనివాసరావు, ఎం.మన్మధరావు, సి.ఎన్.క్షేత్రపాల్ రెడ్డి, కె.వనజాక్షి, ఎన్.నాగభూషణం పాటు మొత్తం 33 మందితో నూతన సమితిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.