
ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ ధర్నా
విశాఖ విద్య: పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ, బదిలీలు, ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ఏ విధమైన స్పష్టమైన జీవోలు లేకుండా రోజుకో ఆలోచనతో జరుగుతున్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ అందరిలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. సమస్యలపై ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పరిష్కారం లభించలేదన్నారు. బదిలీలు, పదోన్నతులు, పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఈ నెల 15న విజయవాడలోని విద్యాభవన్‌ను వేలాది మంది ఉపాధ్యాయులతో ముట్టడిస్తామన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ కుమార్ వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కలెక్టరేట్ అధికారులకు కూడా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, టి.జగన్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.