విశాఖలో మాయా లోకం | - | Sakshi
Sakshi News home page

విశాఖలో మాయా లోకం

May 11 2025 12:36 PM | Updated on May 11 2025 12:36 PM

విశాఖ

విశాఖలో మాయా లోకం

● మధురవాడలో రెండు ఐకానిక్‌ ప్రాజెక్టులకు వీఎంఆర్‌డీఏ ప్రణాళికలు ● రూ.460 కోట్లతో ఈస్ట్‌కోస్ట్‌ హేబిటేట్‌ సెంటర్‌ ● 2.82 ఎకరాల్లో వర్చువల్‌ రియాల్టీ ఎరీనా,త్రీ స్టార్‌ హోటల్‌ ● పీపీపీ విధానంలో చేపట్టేందుకు కసరత్తు ● ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ దరఖాస్తుల ఆహ్వానం
రూ.470 కోట్లతో హేబిటేట్‌ సెంటర్‌

విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్‌ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్‌ వరల్డ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి ‘వైజాగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ వర్చువల్‌ రియాలిటీ ఎరీనా అండ్‌ త్రీ స్టార్‌ హోటల్‌’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్‌ కోస్ట్‌ హేబిటేట్‌ సెంటర్‌ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్నర్‌షిప్‌(పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది.

ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా..

పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్‌ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్‌ హేబిటేట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్‌ఎఫ్‌పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి.

–కె.ఎస్‌.విశ్వనాథన్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌

2.82 ఎకరాల్లో వర్చువల్‌ ఎరీనా

ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్‌ కోస్ట్‌ హేబిటేట్‌ సెంటర్‌’ను నిర్మించాలని వీఎంఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో ఐటీ స్పేస్‌, బిజినెస్‌ సెంటర్‌, రిటైల్‌ స్పేస్‌, ఆడిటోరియం, సెమినార్‌ హాల్‌, పార్టీ ఈవెంట్స్‌ లాన్‌లతో పాటు ట్రేడ్‌ ఫెయిర్లు, ఆర్ట్‌, కల్చర్‌ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్‌ హౌస్‌, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్‌ యాంఫీ థియేటర్‌, 400 మంది పట్టేలా కేఫ్‌టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్‌ డ్రైన్‌ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్‌, 250 మందికి సరిపడా ఈవెంట్‌ లాన్‌్‌, సూపర్‌ మార్కెట్‌, మెడికల్‌, స్పోర్ట్స్‌ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌ఎఫ్‌పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.

విశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్‌ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్‌డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్‌ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ వర్చువల్‌ రియాల్టీ ఎరీనా అండ్‌ 3 స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్‌ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. గేమింగ్‌, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్‌ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్‌, మిక్స్‌డ్‌ రియాల్టీ ఎస్కేప్‌ రూమ్‌, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్‌ టైమ్‌ ట్రావెల్‌, వీఆర్‌ గేమింగ్‌ జోన్‌, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్‌ రెస్టారెంట్‌ అవుట్‌లెట్లు, 10 శాతం కమర్షియల్‌ అవుట్‌లెట్లతో పాటు 100 రూమ్‌లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్‌ హాల్‌తో త్రీ స్టార్‌ హోటల్‌ను నిర్మించనున్నారు.

విశాఖలో మాయా లోకం1
1/3

విశాఖలో మాయా లోకం

విశాఖలో మాయా లోకం2
2/3

విశాఖలో మాయా లోకం

విశాఖలో మాయా లోకం3
3/3

విశాఖలో మాయా లోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement