
ప్రేమ సమాజానికి పెళ్లి కళ
డాబాగార్డెన్స్: ప్రేమ సమాజానికి పెళ్లి కళ వచ్చేసింది. విద్యుత్ వెలుగులు.. పచ్చని తోరణాలతో కళకళలాడుతోంది. ప్రేమ సమాజంలో ఆశ్రయం పొందుతున్న అంధురాలు శివజ్యోతికి అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన రాఘవేంద్రతో ఆదివారం పెళ్లి జరగనుంది. అతడు కోయంబత్తూర్‌లో పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి తంతులో భాగంగా శనివారం పెండ్లి రాట వేసి శివజ్యోతిని పెండ్లి కుమార్తెను చేశారు. ఆదివారం రాత్రి 7.05 గంటలకు వీరిద్దరికి వివాహం జరగనుంది. అందుకు ప్రేమ సమాజం కమిటీ అన్నీ తానై వ్యవహరిస్తోంది. పెండ్లి కుమార్తె శివజ్యోతికి బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి మెట్టెలు, పసుపు, కుంకుమ, స్వీట్స్‌తో పాటు మరికొన్ని చీరలు, పెండ్లి కుమారుడు రాఘవేంద్రకు పట్టు వస్త్రాలను నగర సీపీ శంఖబ్రాత బాగ్చి చేతుల మీదుగా కార్పొరేటర్ కందుల నాగరాజు, నళినిదేవి దంపతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహనరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ప్రేమసమాజం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ప్రేమ సమాజానికి పెళ్లి కళ