
అభ్యాస్
నేడు ఆపరేషన్
● సివిల్ మాక్ డ్రిల్‌కు సర్వం సిద్ధం ● అత్యవసర సమయాల్లో పౌరుల స్పందనపై అవగాహన
విశాఖ సిటీ: ప్రశాంత విశాఖ యుద్ధ క్షేత్రంగా మారనుంది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ మోత మోగనుంది. శత్రు దేశ యుద్ధ విమానాలు.. క్షిపణులు.. డ్రోన్లు దూసుకొస్తున్న వేళ.. పౌరుల ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ జరగనుంది. రక్షణ దళాలు, పోలీసులు, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇతర శాఖల అధికారులు.. సంక్షోభ సమయాల్లో పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా అనుసరించాల్సిన విధానాలను వివరించనున్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడి తరువాత భారత్–పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్ర హోం శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. సంక్షోభ సమయంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పౌరులు తమ ప్రాణా లు ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం వన్‌టౌన్ ప్రాంతం, సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఈ డ్రిల్ నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
క్వీన్‌మేరీస్ పాఠశాల, ఆక్సిజన్ టవర్స్ వద్ద డ్రిల్
దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కేంద్ర హోం శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో విశాఖ కేటగిరీ–2లో ఉంది. యుద్ధమే అనివార్యమైతే విశాఖను కూడా పాకిస్తాన్ టార్గెట్‌గా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సాయంత్రం 4 గంటలకు వన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న క్వీన్‌మేరీస్ పాఠశాల వద్ద, రాత్రి 7.15 గంటలకు ఆక్సిజన్ టవర్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఆ సమయంలో నగరంలో సైరన్ మోత మోగుతుంది. వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పోలీసులు, ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్, వైద్య, రెవెన్యూ, ఇతర స్థానిక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటా రు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కలిగిస్తారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. సైరన్ మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలి? విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందులపై ప్రజలకు వివరించనున్నారు.
నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో...
అలాగే నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వద్ద గల ఎస్‌బీఐ, కేజీహెచ్ వద్ద గల ఏఎంసీ మహిళా హాస్టల్, దొండపర్తి వద్ద గల డీఆర్‌ఎం ఆఫీస్, వన్‌టౌన్‌లోని రోజ్ హిల్స్, ఏయూ అవుట్ గేట్ వద్ద ఉన్న జేవీడీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఏయూ నార్త్ క్యాంపస్ వద్ద ఉదయం 10 గంటలకు ఎన్‌సీసీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు.
మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించాలి
మహారాణిపేట: మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో మాక్ డ్రిల్ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. యుద్ధం జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు.