
హోటళ్లలో పోలీసుల తనిఖీలు
● ఫైర్ ఎన్‌వోసీలు లేకుండా 30 హోటళ్ల నిర్వహణ ● ట్రేడ్ లైసెన్సులు లేకుండా 25, జీఎస్టీ లేకుండా 21 వ్యాపారాలు
విశాఖ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న హోటళ్లు, లాడ్జిలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జోన్–1, 2 పరిధిలో ఉన్న 74 హోటళ్లలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హోటళ్లలో భద్రతా ప్రమాణాలు, అనుమతులు, రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఇందులో అనేక హోటళ్లు, లాడ్జిల్లో కనీస అనుమతులు లేనట్లు గుర్తించారు. ప్రధానంగా అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీలు లేకుండా 30 హోటళ్లు, ట్రేడ్ లైసెన్సు లేకుండా 25, ఫుడ్ లైసెన్సు లేకుండా 3, జీఎస్టీ లేకుండా 21 హోటళ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. అలాగే 16 హోటళ్లలో సీసీ కెమెరాలు, 32 హోటళ్లలో వీఎంఎస్‌లో సందర్శకుల సమాచారాన్ని అప్‌డేట్ చేయడం లేదని గుర్తించారు. నిబంధనలు పాటించని వ్యాపార సముదాయాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు.