
ఏవోబీలో టెన్షన్ టెన్షన్
● మావోయిస్టుల సంచారంపై
నిఘా వర్గాల హెచ్చరిక
● అప్రమత్తమైన పోలీసులు
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు అప్రమత్తయ్యారు. ఇటీవల జిల్లాలోని కాకులమామిడి, కాంటవరం అటవీ ప్రాంతంలో రెండు సార్లు మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం తెలిసిందే. అప్పటినుంచి ఏవోబీ సరిహద్దులో మావోయిస్టులు తలదాచుకుంటున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు మండల కేంద్రంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఏవోబీ సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలు కుణ్ణంగా పరిశీలించి, విడిచి పెట్టారు.మండల కేంద్రంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులు, బలగాలు గస్తీ నిర్వహించాయి.అనుమానితులను ప్రశ్నించి, వివరాలు సేకరించి విడిచి పెడుతున్నాయి.
ఒడిశా పోలీసు బలగాలు..
ఒడిశా పోలీసు బలగాలు సైతం మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీ, పాడువ, జోలాపుట్టు గ్రామాల్లో అడుగడుగునా తనఖీలు చేస్తున్నాయి. ఏవోబీలోని గుర్రసేత్, రూడకోట, జోడం గ్రామాల్లో గ్రామాల్లోని అవుట్ పోస్టుల పరిధిలో పోలీసు బలగాలు సరిహద్దు గ్రామాల్లోని అటవీ ప్రాంతం వైపు కదులుతూ జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎప్పుడూ ఏ సంఘటన జరుగుతుందో అంటూ మారుమూల గ్రామాల గిరిజనులు భయం భయంగా ఉంటూ గ్రామాలకే పరిమితం అయ్యారు.
ప్రజాప్రతినిధులకు నోటీసులు
ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయనే నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. తనిఖీలతో పాటు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న నేతలతో పాటు సర్పంచులు, ఎంపీటీసీలకు పోలీసు అలెర్ట్ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఈ మద్య కాలంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల అనంతరం నిషేధిత మావోయిస్టు సభ్యులు గ్రూపులుగా ఏర్పడ్డారు. వీరు ఏజెన్సీ ప్రాంతం మొత్తం విస్తరించి, ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలు చేయుటకు అవకాశం ఉంది. అందువల్ల మావోయిస్టు పార్టీ హిట్ లిస్టు ఉన్న లేదా పొలిటికల్ లీడర్ అయిన మీరు పోలీసు వారి అనుమతి లేకుండా లోపల ఉన్న గ్రామాలకు వెళ్లరాదు. మీరు సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఉండాలని నోటీసు ద్వారా తెలియజేయడమైనదని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.