
దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం
అనకాపల్లి: నేరాల దర్యాప్తులో ఆధునిక శాసీ్త్రయ విధానాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం పోలీసు, వైద్యులు, న్యాయవాదులతో నేరచరిత్రపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరస్థలాల్లో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ, ’చైన్ ఆఫ్ కస్టడీ’ పాటించాల్సిన విధానాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్, వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్‌న్స్ మేనేజిమెంట్ శిక్షణ ద్వారా నిందితులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, విషపదార్థాలు (టాక్సికాలజీ), డిజిటల్ ఆధారాలు, సైబర్ నేరాల పరికరాలు, ఆడియో–వీడియో ఫుటేజ్, డీఎన్‌ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలు వంటి ఆధారాల సేకరణ, ప్యాకింగ్, భద్రపరచే విధానంపై దృష్టి సారించి, సంబంధిత ఆధారాలతో సకాలంలో కోర్టుకు ఇవ్వడం వల్ల నిందితులకు శిక్ష పడుతుందన్నారు. అంతకుముందు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.నాగరాజు, శాసీ్త్రయ సహాయకులు ఎం.రాంబాబు, పి.వి.ఎస్.బి.చలపతి, ఇ.కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు లక్ష్మణ్ మూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, విజయ, ఎస్‌ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు.

దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం