
అధిక ధరలకు విక్రయిస్తున్న స్టాళ్లపై కేసులు
రైల్వేస్టేషన్‌లో తూనికల కొలతల శాఖ తనిఖీలు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని పలు స్టాళ్లలో అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో తూనికల కొలతల శాఖ అధికారులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ కంట్రోలర్ కె.థామస్ రవికుమార్ నేతృత్వంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి 8వ నంబర్ ప్లాట్‌ఫాం వరకు ఉన్న వివిధ స్టాళ్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పలు స్టాళ్ల నిర్వాహకులు బిస్కెట్లు, శీతల పానీయాలను ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి రూ.15 అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన స్టాళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ప్యాకేజీ వస్తువులపై ముద్రించిన ధరకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దని ప్రయాణికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో అసిస్టెంట్ కంట్రోలర్లు పి.డి.వి.అప్పలరాజు, ఎస్.ఎం.రాధాకృష్ణ, బి.రామచంద్రయ్య, పి.చిన్నమ్మలతో పాటు ఇన్‌స్పెక్టర్లు వి.రామారావు, ఎస్.ఉమా సుందరి, డి.అనురాధ తదితరులు పాల్గొన్నారు.