కేజీహెచ్‌లో నకిలీ నియామకాల కలకలం | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో నకిలీ నియామకాల కలకలం

Nov 28 2023 12:58 AM | Updated on Nov 28 2023 12:58 AM

పోస్టింగు ఆర్డర్‌ తీసుకొచ్చి మేనేజర్‌కు చూపిస్తున్న యువకుడు   - Sakshi

పోస్టింగు ఆర్డర్‌ తీసుకొచ్చి మేనేజర్‌కు చూపిస్తున్న యువకుడు

● సూపరింటెండెంట్‌ పేరుతో నియామక ఉత్తర్వులు ● షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుకు నకిలీ ఆర్డర్‌తో కార్యాలయానికి యువకుడి రాక ● ఆ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వెనుక సిబ్బంది పాత్ర ● పోలీసులకు ఫిర్యాదు చేయనున్న అధికారులు

మహారాణిపేట : కేజీహెచ్‌లో నకిలీ నియామక ఉత్తర్వుల వ్యవహారం కలకలం సృష్టించింది. షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుకు సంబంధించి ఒక మహిళ పేరుతో నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఆస్పత్రిలో సంచలనం రేపింది. కేజీహెచ్‌లో పలు పోస్టులకు వైద్యాధికారులు రెండేళ్లుగా భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. ఇప్పటికే మెజార్టీ పోస్టుల నియామకాలు పూర్తి చేశారు. ఇదిలావుండగా షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టుకు సంబంధించి నియామక పత్రాన్ని ఓ వ్యక్తి కేజీహెచ్‌ పరిపాలనా విభాగానికి తీసుకొచ్చాడు. ఈ నియామక పత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళది. దీనిపై ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అనుమతితో కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌, సంబంధిత గుమస్తా, సెక్షన్‌ పర్యవేక్షకుడు సంతకం కూడా ఉంది. ఆర్డర్‌ పొందిన మహిళకు పే స్కేల్‌ కూడా ఫిక్స్‌ చేశారు. డిసెంబర్‌ 15వ తేదీలోగా విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో ఉంది. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌, అడిషినల్‌ డీఎంఈ, డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌ పేరుతో అపాయింట్‌మెంట్‌ లేఖలో ఉండడాన్ని సిబ్బంది గమనించారు. సదరు మహిళ రాకుండా వేరే వ్యక్తి ద్వారా నియామక పత్రం తీసుకురావడం, నియామకపత్రంలో పలు అనుమానాలుండడంతో కేజీహెచ్‌ పరిపాలన విభాగం సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. నియామకపత్రం నకిలీదని నిర్థారణకు వచ్చారు. వెంటనే విషయాన్ని కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

మరిన్ని నకిలీ ఆర్డర్లు ఉన్నాయా..?

వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే నకిలీ ఆర్డర్ల వ్యవహారం కుదిపేసింది. తాజాగా ఇపుడు కేజీహెచ్‌లో కూడా అదే తరహా ఘటన బయటపడింది. ఈ నేపథ్యంలో మరిన్ని నియామకాల విషయంలో ఇటువంటి నకిలీ ఆర్డర్లు ఉన్నాయా..? అన్నది ప్రస్తుతం కేజీహెచ్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై లోతైన విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో కేజీహెచ్‌ అధికారులున్నారు.

కేజీహెచ్‌ సిబ్బందిపై అనుమానాలు

ఈ నకిలీ ఆర్డర్‌ వెనుక కేజీహెచ్‌లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సంబంధం ఉన్నట్టు ఆస్పత్రిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేజీహెచ్‌లో ఇటువంటి వ్యవహారాలు ఎన్ని జరిగాయి...? నకిలీ ఉత్తర్వుల వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు..? అనే విషయాలపై కేజీహెచ్‌ అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇలా జరగడం రెండోసారి

సోమవారం తీసుకొచ్చిన నకిలీ నియామక పత్రం రెండోదిగా గుర్తించాం. గతంలో కూడా ఒక వ్యక్తి ఇలా నకిలీ ఆర్డర్‌ తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ రావడంతో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాం. సంతకాలు, ఫైల్‌ నంబరు ఒకేలా ఉన్నాయి. దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు పోస్టింగు ఆర్డర్‌ బయటకు వచ్చింది. రేపు ఇంకా ఏమైనా చేస్తారా అన్న అనుమానం వుంది.

– డాక్టర్‌ పి.అశోక్‌ కుమార్‌,

సూపరింటెండెంట్‌, కేజీహెచ్‌, విశాఖ

కేజిహెచ్‌ సూపరింటెండెంట్‌ పేరిట నకిలీ ఉత్తర్వులు కాపీ 1
1/2

కేజిహెచ్‌ సూపరింటెండెంట్‌ పేరిట నకిలీ ఉత్తర్వులు కాపీ

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement