కార్మిక సమ్మెను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్
తాండూరు టౌన్: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ఈ నెల 12న దేశ వ్యాప్తంగా తలపెట్టిన కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లేబర్ కోడ్‌లు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దు, జాతీయ విద్యుత్ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా కార్మిక లోకం సమ్మె చేపడుతోందన్నారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి
బొంరాస్‌పేట: కళాశాల విద్యతోనే యువత భవిష్యత్ ఆధారపడి ఉంటుందని, అందుకు తగిన ప్రణాళికలు, లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించగా కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు.
ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు శనివారం 968 సంచుల కందులు వచ్చాయి. క్వింటాలుకు ఎక్కువగా రూ.8,250 మధ్యస్థంగా రూ.8,100, తక్కువగా రూ.7,800కు వ్యాపారులు కొనుగోలు చేశారు. గత వారంతో పోలిస్తే క్వింటాలుకు రూ.300 తగ్గడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
డీపీఓ జయసుధ
బషీరాబాద్: పుట్టగొడుగుల్లా అక్రమ కట్టడాలు అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి డీపీఓ జయసుధ స్పందించారు. మండల కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై శనివారం ఎంపీడీఓ సంపత్‌కుమార్ చర్చించారు. అనుమతులు లేని భవన నిర్మాణాలను వెంటనే ఆపేయాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి జయకర్ నోటీసులు ఇచ్చిన యజమానులతో మాట్లాడి అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని సూచించారు.
ఇబ్రహీంపట్నం రూరల్: సైబర్‌క్రైమ్‌తో అప్రమత్తంగా ఉండాలని, వాటి జోలికిపోయి మోసవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ ఆధ్వ ర్యంలో శంషాబాద్ డీసీపీ రాజేష్ అధ్యక్షతన శనివారం కొంగరకలాన్‌లోని శ్లోకా కన్వెన్షన్ హాల్‌లో జాగృతి హైదరాబాద్–సురక్షిత్ హైదరాబాద్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సజ్జనార్ మాట్లాడుతూ.. రోజురోజుకూ సైబర్‌మోసాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోందని, స్మార్ట్ ఫోన్లతో సమస్యలు వస్తున్నాయన్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అనవసర లింక్‌లు, ఏపీకే యాప్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఓపెన్ చేయాలని, లేదంటే డిలీట్ చేయాలని సూచించారు. మహిళలు సామాజిక మాధ్యమాల్లో వారి వ్యక్తిగత ఫొటోలు పెట్టుకోవద్దన్నారు.


