వికారాబాద్‌ను అగ్రగామిగా నిలుపుతాం
● మున్సిపల్ ఎన్నికల్లో అనన్యను ఆదరించండి
● స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
● పలు వార్డుల్లో రోడ్ షో
అనంతగిరి: వికారాబాద్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయిన రెండేళ్లలో వికారాబాద్ అభివృద్ధికి రూ.100 కోట్లు తెచ్చానని తెలిపారు. జిల్లా నుంచి సీఎం ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఈ ప్రాంతానికి అధిక నిధులు వస్తున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న నా కూతురు గడ్డం అనన్యను ఆదరించాలని కోరారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర బడ్జెట్ గాడిలో పడుతోందన్నారు. వికారాబాద్ నియోజకవర్గానికి 5వేల ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేయించినట్లు పేర్కొన్నారు. ఇతర పార్టీలకు ఓట్లు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. మీ అందరి ఆశీర్వాదం నా బిడ్డ అనన్య మీద ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డు అభ్యర్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.


