అంత్యక్రియలకు ఖర్చులు ఇవ్వండి
కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
తాండూరు టౌన్: మున్సిపల్ కార్మికులు మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం ఖర్చులు చెల్లించాలంటూ తాండూరు మున్సిపల్ స్టాఫ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు గురువారం పట్టణ మున్సిపల్ కమిషనర్ యాదగిరికి వినతిపత్రం అందజేశారు. అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల కార్మికులు మృతి చెందితే వారి అంత్యక్రియల నిమిత్తం రూ.20 వేలు అందజేయాలని నిబంధనల్లో ఉన్నప్పటికీ మున్సిపల్ కార్యాలయం నుంచి ఇవ్వడం లేదన్నారు. అనారోగ్యం కారణంగా గురువారం మృతి చెందిన జోన్ 3లో విధులు నిర్వర్తించే పారిశుద్ధ్య కార్మికురాలు నర్సమ్మ అంత్యక్రియల ఖర్చులకు నగదు అందజేయాలని కమిషనర్‌ను కోరినట్లు యూనియన్ నాయకులు గోపాల్, అశోక్, వెంకటప్ప, యాదగిరి, భాస్కర్, రమేష్, రాములు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన రూ.10 వేలు అంత్యక్రియల ఖర్చులకు అందజేశారన్నారు. నిబంధనల్లో పొందుపరిచిన విధంగా భవిష్యత్‌లో కార్మికులకు ఆర్థికసాయం అందజేయాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు.


