ధ్యాన యాగం.. ఆధ్యాత్మిక యోగం
ఈ నెల 21 నుంచి పత్రీజీ ధ్యాన మహాయాగం 11 రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు దేశ, విదేశాల నుంచి తరలిరానున్న ధ్యానులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నిర్వాహకులు
కడ్తాల్: ధ్యాన మహాయాగం కోసం మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం ముస్తాబవుతోంది. మండల కేంద్రం సమీపంలోని పత్రీజీ శక్తి స్థల్‌లో ఈ నెల 21న (ఆదివారం) వేడుకలు ప్రారంభమై, 31 వరకు కొనసాగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ప్రముఖ ఆధ్యాత్మిక, ధ్యాన గురువులు హాజరుకానున్నారు. ఈ మేరకు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ, మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
పదమూడు సంవత్సరాలుగా..
13 సంవత్సరాలుగా ఏటా డిసెంబర్‌లో ఇక్కడ ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ, విదేశాల నుంచి వేలాది మంది ధ్యానులు తరలిరానున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలకు వచ్చే ధ్యానులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నారు. ఉచిత అన్నదాన కేంద్రం, శాశ్వత గదులతో పాటు తాత్కాలిక వసతి గృహాలు, కుటీరాలు నిర్మిస్తున్నారు. వేడుకలు జరిగినన్ని రోజులు ధ్యానం చేసేందుకు వీలుగా భారీ సభా ప్రాంగణం, ప్రత్యేకంగా అలంకరించిన పెద్ద వేదిక సిద్ధం చేస్తున్నారు. శుద్ధమైన తాగునీటి సౌకర్యంతో పాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశారు.
ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలు..
ధ్యాన మహాయాగంలో భాగంగా ప్రతిరోజు పత్రీజీ వీడియో సందేశం, ప్రముఖ ధ్యాన గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు ఉంటాయి. నిత్యం ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు సామూహిక వేణుగాన ధ్యానం, అఖండ ధ్యానం, ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ధ్యాన గురువుల సందేశాలు, గురు సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.


