‘ఉపాధి’కి సరికొత్త రూపు
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో ‘వీబీ–జీ రామ్ జీ’ పని దినాలు 100 నుంచి 125కు పెంపు మండలంలో 4,459 మంది కూలీలకు ప్రయోజనం
దుద్యాల్: ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు 20 ఏళ్లుగా అమలులో ఉన్న ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ స్థానంలో కొత్త చట్టం తేనుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్ జీ) పేరును ప్రతిపాదించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన విషయం తెలిసిందే. దీంతో ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు నిబంధనలు సైతం మారనున్నాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే పథకం అమలులో లోపాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు పెట్టిన ఖర్చులకు పొంతన లేకపోవడం వంటి అనేక లోపాలు ఈ వ్యవస్థలో కనిపించనట్లు సమాచారం. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేసి మరింత ఆధునిక, పారదర్శక విధానాలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ బిల్లుతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నియంత్రించడం వంటి లక్ష్యాలను చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. రైతులు, కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర ప్రయోజనాలు చేకూరేలా ఈ చట్టాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
పని దినాలు పెంపు
ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించేవారు.కొత్త చట్టంతో 125 రోజుల పనిది నా లు కల్పించనున్నారు. పెంచిన రోజుల్లో నైపు ణ్య అవసరమైన పనులు చేయడానికి ముందుకొచ్చే వారికి మాత్రమే 125 రోజులు వర్తస్తాయి. పని దినాలు పెరగడంతో కూలీలకు వార్షిక ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
సకాలంలో వేతనాల చెల్లింపు
కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించాలని, గరిష్టంగా పదిహేను రోజులు మించి ఆలస్యం చేయరాదని బిల్లులో స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తోంది. దీంతో కూలీలు పని చేసిన వారం నుంచి రెండు వారాల్లో వేతనాలు అందుకోవచ్చు. గతంలో ఆరు నెలలైనా వేతనాలు అందని పరిస్థితి ఉండేది.
వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి
వీబీ–జీ రామ్ జీ చట్టాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేస్తు న్నారు. పొలాల్లో విత్తనాలు వేస్తున్న సమయంలో, కలుపు తీసే తరుణంలో, ఇతర వ్యవసాయ పనులకు ఉపాధి కూలీలను కేటాయిస్తే రైతుకు కొంత భారం తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పెరిగిన దినసరి కూలీల రేట్లకు వ్యవసాయం చే యాలంటేనే అన్నదాతలు జంకుతున్నారు. పెట్టు బడులు అధికమవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మండలంలో ఉపాధి కూలీలు
మండల వ్యాప్తంగా 20 గ్రామ పంచాయతీల్లో 4,459 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. అందులో ఎస్సీలు 1,234 మంది, ఎస్టీలు 1,807 మంది, ఇతరులు 3,613 మంది ఉన్నారు.


