సంక్షేమం అభివృద్ధికి పట్టం
పరిగి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పంచాయతీ ఎన్నికల్లో పరిగి ప్రజలు పట్టం కట్టారని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిగి నియోజకవర్గంలో 206 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 137 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారన్నారు. జిల్లాలోనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది పరిగిలోనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి ఘనత సీఎం రేవంత్‌రెడ్డికు దక్కుతుందన్నారు. సర్పంచ్‌లకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. పంచాయతీల అభివృద్ధికి ఎస్‌డీఎఫ్ నిధులు మంజూరు చేయిస్తామన్నారు. పరిగిని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని అన్నారు. జిల్లాను లక్ష కోట్ల నిధులతో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు. కొత్త సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం రోజే పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయూబ్, పూడూరు మండల అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, నాయకులు చిన్ననర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


