సీఎం ఇలాకాలో హస్తం హవా | - | Sakshi
Sakshi News home page

సీఎం ఇలాకాలో హస్తం హవా

Dec 19 2025 11:21 AM | Updated on Dec 19 2025 11:21 AM

సీఎం ఇలాకాలో హస్తం హవా

సీఎం ఇలాకాలో హస్తం హవా

● మూడు విడతల్లోనూ ఇదే జోరు ● పారీ శ్రేణుల్లో పెరిగిన జోష్‌ ● ప్రాదేశిక స్థానాలకు పెరిగిన డిమాండ్‌

అత్యధిక సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకున్న కాంగ్రెస్‌ మద్దతుదారులు

కొడంగల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో అత్యధిక సర్పంచ్‌ స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు సొంతం చేసుకున్నారు. మెజార్టీ గ్రామాలను కాంగ్రెస్‌ పార్టీ హస్తగతం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపించింది. కాంగ్రెస్‌ ఊపును చూసి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి నుంచే ప్రాదేశిక స్థానాల్లో పోటీ చేయడానికి పోటీ పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు డిమాండ్‌ పెరిగింది. కొత్త సర్పంచులే గెలిపిస్తారని పలువురు ఆశావహులు భావిస్తున్నారు.

మూడు విడతల్లోనూ..

మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 11న జరిగాయి. కొడంగల్‌, దుద్యాల్‌, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండల్లాలోని 262 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు 179 మంది, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 72 మంది, బీజేపీ తరఫున ఇద్దరు, ఇతరులు 9 మంది విజయం సాధించారు. కొడంగల్‌ మండలంలో ఒకటి, దౌల్తాబాద్‌లో మూడు, బొంరాస్‌పేటలో 7, దుద్యాల్‌లో 2, తాండూరు మండలంలో ఆరు, బషీరాబాద్‌లో 5, యాలాలలో 10, పెద్దేముల్‌లో 5 గ్రామాల్లో సర్పంచు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రెండో విడతలో..

రెండో విడత ఎన్నికలు ఈ నెల 14న జరిగాయి. వికారాబాద్‌, ధారూర్‌, మోమిన్‌పేట, నవాబుపేట, బంటారం, మర్పల్లి, కోట్‌పల్లి మండలాల్లోని 175 గ్రామాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు 110 మంది, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 34, బీజేపీ 8 మంది, ఇతరులు 23 మంది గెలిచారు.

కొడంగల్‌ నియోజకవర్గంలో..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, దుద్యాల్‌, కోస్గి, గుండుమాల్‌, మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. కొడంగల్‌ మండలంలో 25 గ్రామ పంచాయతీలకు గాను 24 గ్రామాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కై వసం చేసుకున్నారు. దుద్యాల్‌లో 20 జీపీలకు గాను 15 కాంగ్రెస్‌, నాలుగు బీఆర్‌ఎస్‌, ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బొంరాస్‌పేట మండలంలో 35 పంచాయతీలకు గాను కాంగ్రెస్‌ మద్దతుదారులు 29 మంది, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఐదుగురు, ఒకరు స్వతంత్రులు విజయం సాధించారు. దౌల్తాబాద్‌ మండలంలో 33 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ 22 మంది, బీఆర్‌ఎస్‌ 10 మంది, ఒకరు స్వతంత్రఅభ్యర్థులు గెలిచారు. ఇదే ఊపు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సర్పంచ్‌లతో సఖ్యతగా ఉంటూ ప్రాదేశిక స్థానాలను సొంతం చేసుకునేందుకు బాట వేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి చేరువ కావాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ పార్టీ తరఫున గెలిచిన వారి అండదండలతో ముందుకు సాగాలని భావిస్తున్నారు.

తుది పోరులో..

మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరి గాయి. పరిగి, పూడూరు, చౌడాపూర్‌, దోమ, కుల్కచర్ల మండలాల్లో 157 గ్రామాలకు గానూ కాంగ్రెస్‌ మద్దతుదారులు 100 మంది, బీఆర్‌ఎస్‌ 42 మంది, బీజేపీ ముగ్గురు, ఇతరులు 12 మంది గెలిచారు. మూడు విడతల్లోనూ అధికార కాంగ్రెస్‌ పార్టీ అధిక పంచాయతీల్లో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement