ఊరు.. ఓటుకు..కదిలారు
మండలాల వారీగా పోలింగ్ వివరాలు
తొలి విడతతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం
వికారాబాద్: రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిసాయి. వికారాబాద్ రెవెన్యూ డివిజన్‌లో వికారాబాద్, ధారూరు, బంట్వారం, కోట్‌పల్లి, నవాబుపేట, మోమిన్‌పేట, మర్పల్లి 175 పంచాయతీలుండగా 20 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. 155 పంచాయతీల్లో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 4 గంటలకే ఫలితాలు వెలువడ్డాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ట్యాబ్‌లతో వెబ్‌కాస్టింగ్ చిత్రీకరించారు. అవకతవకలు తావులేకుండా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. మర్పల్లిలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవాబుపేట మండలం చించల్‌పేటలో చెవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ధారూరు మండలం కేరెళ్లిలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఓటు వేశారు. వికారాబాద్ మండలం సర్పన్‌పల్లిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మోమిన్‌పేట మండలం కోల్కుందలో సర్పంచ్ అ భ్యర్థి కీర్తి నిరసన తెలిపారు. అధికారులు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మోమిన్‌పేట మండలం బాల్‌రెడ్డిగూడ, వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామాల్లో అభ్యర్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
82.72 శాతం పోలింగ్ నమోదు
జిల్లాలోని ఏడు మండలాల్లో జరిగిన పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో సగటున 82.72 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వికారాబాద్ మండలంలో అత్యధికంగా 87.77 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా బంట్వారంలో 80.25శాతం ఓటింగ్ నమోదైంది. మొదటి విడత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఒంటింగట వరకు పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వచ్చిన వారందరిని ఓటు వేసేందుకు అనుమతించారు. ఉదయం 9 గంటలకు 20.67 శాతం, 11 గంటలకు 52.35 శాతం మధ్యాహ్నం ఒంటి గంటలవరకు 78.30 శాతం నమోదయింది. చివరకు 82.72 శాతానికి చేరుకుంది. వృద్ధులను, దివ్యాంగులను కుర్చీల్లో, వీల్ చైర్‌లలో పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మొత్తం ఓట్లు 2,09,847 ఓట్లలో 1,03,932 మంది పురుషులు, 1,05,914 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 86,968 మంది పురుషులు 83.68 శాతం ఓటు హక్కును వినియోగించుకోగా 86,625 మంది మహిళలు 81.99 శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అధికారుల పర్యవేక్షణ
మలి విడత ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారులు పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు యాస్మిన్‌బాష పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. వసతులు, పోలింగ్ శాతం, తదితర వివరాలను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎస్పీ స్నేహ మెహ్ర పలు పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. కౌంటింగ్ ముగిసి ఫలితాలను వెల్లడించే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలు, సంబురాలకు అనుమతి లేదని, అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకోవాలని ఆమె స్థానిక పోలీసు అధికారులకు సూచించారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ మండలంలోని 21 పంచాయతీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పర్యవేక్షించారు. నారాయణపూర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎర్రవల్లి కేంద్రాన్ని జిల్లా సాధారణ పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాషా, పీరంపల్లిలో అడిషనల్ కలెక్టర్ సుధీర్, పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు.
అనంతగిరి: తొలిసారి ఓటేసిన యువతి
ఓటు వేసేందుకు వెళ్తున్న వృద్ధురాలు
వికారాబాద్‌లో అత్యధికంగా 87.77 శాతం, అత్యల్పంగా బంట్వారంలో 80.25 శాతం
పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల పరిశీలకులు
గెలుపొందిన అభ్యర్థులకు అభినందనల వెల్లువ
మండలం పురుషులు మహిళలు మొత్తం ఓట్లు పోలైనవి శాతం
బంట్వారం 8,417 8,881 17,208 13,882 80.25
ధారూరు 16,573 17,385 33,958 28,712 84.55
కోట్‌పల్లి 8,537 8922 17,459 14,523 83.18
మర్పల్లి 22,202 21,834 44,036 36,094 81.96
మోమిన్‌పేట్ 17,723 18,104 35,828 28,950 80.80
నవాబుపేట్ 18,552 18,479 37,031 30,159 81.44
వికారాబాద్ 11,928 12,309 24,237 21,274 87.77
ఊరు.. ఓటుకు..కదిలారు


