తుది పోరుకు ర్యాండమైజేషన్
● 17న ఐదు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్
పరిగి: మూడో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్‌జైన్, సాధారణ ఎన్నికల పరిశీలకురాలు షేక్ యాస్మిన్ బాష సూచించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధలను అనురిస్తూ ర్యాండమైజేషన్ నిర్వహించామన్నారు. ఐదు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నన్నట్లు వెల్లడించారు. మొత్తం 157 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే 17 పంచాయతీలు ఏకగ్రీవమగా.. 140 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 1,340 వార్డులకు గాను 130 వార్డులు ఏకగ్రీవమవగా 1,202 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు 1,470, ఓపీఓలు 1,726, టూ మెంబర్ టీం 988, త్రీ మెంబర్ టీం 214లను ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని కేటాయించామన్నారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యనాయక్, సుధీర్, డీపీఓ జయసుధ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


