జాతరకు సర్వం సిద్ధం
ఎల్లమ్మ ఉత్సవాలకుఏర్పాట్లు ముమ్మరం
● ఈనెల 19 నుంచి ప్రారంభం
యాలాల: మండల పరిధిలోని ముద్దాయిపేట జగన్మాత రేణుక ఎల్లమ్మమాత ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే జాతరకు ఆలయ కమిటీ, గ్రామ పెద్దల సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తాండూరు నియోజకవర్గంలో రెండో అతిపెద్ద జాతరగా ఎల్లమ్మ జాతరకు పేరు ఉంది. ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు పొరుగు మండలాలు, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇప్పటికే జాతరలో భాగంగా రంగుల రాట్నం, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్ రైలు లాంటి వినోద వస్తువులు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే మాదిరిగానే ఈసారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమాల వివరాలు
ఉత్సవాలు 18న రాత్రి అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభం కానున్నాయి. ఎల్లమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన సిడే ఊరేగింపును 19న(శుక్రవారం) సాయంత్రం నిర్వహిస్తారు. 20న (శనివారం) చుక్క బోనాలు, 21న(ఆదివారం) రథోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రతి రోజు ఆలయ ఆవరణలో భజన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త దేవగారి రాములు, సర్పంచ్ పంతుల రుద్రమణి, మాజీ సర్పంచ్‌లు విఠలయ్య, బిచ్చన్నగౌడ్, క్రిష్ణయ్యగౌడ్, గ్రామ పెద్దలు, యువకులు వివరించారు.
నిర్వహణ కమిటీ ఏర్పాటు
జాతర ఏర్పాట్లు విజయవంతం అయ్యేందుకు గ్రామ యువకులతో కూడిన నూతన కమిటీని గ్రామస్తులు ఎన్నుకున్నారు. జాతర ఆలయ కమిటీ అధ్యక్షుడిగా భానుప్రసాద్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా బాలవర్ధన్‌గౌడ్, సభ్యులుగా సుదర్శన్‌గౌడ్, శేఖర్‌గౌడ్, బాలక్రిష్ణగౌడ్, గోవర్ధన్‌గౌడ్, శివకుమార్, క్రిష్ణయాదవ్, భీమ్ యాదవ్, చంద్రకుమార్, సంపత్‌గౌడ్, రమేశ్, శ్రీనివాస్, పవన్, విష్ణువర్థన్ తదితరులు ఉన్నారు.
జాతరకు సర్వం సిద్ధం


