గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
తాండూరు టౌన్: జిల్లా టాస్క్‌ఫోర్స్, తాండూరు, పరిగి, వికారాబాద్ ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ముగ్గురు వ్యక్తుల నుంచి ఎండు గంజాయి, గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆదివారం తాండూరు రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. మద్యనిషేధ జిల్లా అధికారి విజయభాస్కర్ తెలిపిన ప్రకారం.. భువనేశ్వర్ నుంచి ముంబాయికి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తాండూరుకు గంజాయి రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు తాండూరు స్టేషన్‌లో మాటు వేసి రైలు దిగిన ముగ్గురు వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా రెండు ప్యాకెట్లలో 7.6 కిలోల ఎండు గంజాయితో పాటు, 366 గ్రాముల గంజాయి చాక్లెట్లు లభించాయన్నారు. ఈమేరకు గంజాయిని సీజ్ చేసి ఒడిశాకు చెందిన శిశ్రు కుమార్ బెహ్రా, కర్నాటకకు చెందిన మహ్మద్ జిలాని, సత్తార్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, డీటీఎఫ్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు ప్రేమ్‌కుమార్‌రెడ్డి, రవికుమార్, సుతారి, వీరాంజనేయులు, సిబ్బంది హన్మంతు, భీమయ్య, రాధిక, రవికిరణ్, విష్ణు, మహేష్, ఫరీద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
7.6 కిలోల ఎండు గంజాయి, 366 గ్రాముల గంజాయి చాక్లెట్లు స్వాధీనం


