మామిడిలో సస్యరక్షణ
పూత నిలిస్తేనే లాభాల పంట
● ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు
చలి అనుకూలమే..
మొగ్గ దశలో చలి ఎక్కువ గా ఉండడం మొక్కకు చాలా ఉపయోగమే. నాకు 20 ఎకరాల మామిడి తోట ఉంది. అధికారుల సూచన లు, యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా. సకాలంలో మందులు పిచికారీ చేస్తున్నా. రాత్రి వేళల్లో చలి తీవ్రత 15 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే పూత బాగా నిలుస్తుంది.
– పిట్ల మల్లేశ్, మామిడి రైతు, హస్నాబాద్
సూచనలు పాటించాలి
మామిడి రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి. క్రమం తప్పకుండా తోటల ను పరిశీలించాలి. వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏ సమస్య ఉన్నా వెంట నే అధికారులను సంప్రదించాలి. ప్రతీ క్లస్టర్‌కు ఒక ఉద్యాన శాఖ అధికారి అందుబాటులో ఉంటారు.
– ఎంఏ సత్తార్, ఉద్యాన శాఖ అధికారి
దుద్యాల్: మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 13 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పండే ప్రధాన పంటల్లో మామిడి కూడా ఒకటి. ప్రస్తుతం పంట పూత దశలో ఉంది. వాతావరణం అనుకూలంగానే ఉందని ఉద్యాన, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో తోటలను పరిశీలించి రైతులకు సూచనలు ఇస్తున్నారు.
పూమొగ్గ బయటకు వచ్చే వరకు నీటి తడి ఇవ్వరాదు.
మొగ్గ పగిలే దశలో పొటాషియం నైట్రేట్ (13:0:45) 10 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. దీంతో మొగ్గ పడిలి పూత వచ్చే అవకాశం ఉంటుంది.
జూన్– జూలై మాసంలో ఎరువులు వేయని మామిడి రైతులు ప్రస్తుత దశలో అరకిలో యూరియా, అరకిలో పొటాష్‌ను వేసువేసుకోవాలి.
నీటి వసతి లేనివారు పిందె దశలో ఒక శాతం యూరియా ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
పూత ఆలస్యమైతే తోటలో కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవాలి.
మామిడిపై చీడపీడల యాజమాన్యం..
ఆకులపై బూడిద మచ్చలు గమనిస్తే ముందు జాగ్రత్త చర్యగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా సాఫ్ 2 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి చెట్టుపై పిచికారీ చేసుకోవాలి.
ఆకుపై నల్ల మచ్చలు ఉంటే పైకొమ్మలకు సోకి పూత రాలిపోతుంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో 3 గ్రాముల ఆక్సీక్లోరైడ్ మందును కలిపి స్ప్రే చేయాలి.
పూత, పిందె దశలో ఆకుమచ్చ పురుగు వ్యాప్తి చెందితే నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి 15 రోజు వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
మొగ్గ తొందరగా విచ్చుకోవడానికి, పూల కాడ పొడవుగా పెరగడానికి పొటాషియం నైట్రేట్(13:0:45) 10 గ్రాముల మందును ఒక లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి.
తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైమిథోయేట్ 2 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగు అధికంగా ఉన్నప్పుడు లీటరు నీటికి ఫిఫ్రోనిక్ 2 మి.లీ లేదాఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోపాడ్(ట్రెసర్ 0.3 మి.లీ లేదా థయోమిథాక్సిన్(అక్టరా) 0.3 గ్రాముల మందులను లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి.
పిండినల్లి పురుగు నేల నుంచి చెట్టు పైకి పాకకుండా చెట్టు ప్రధాన కాండంపై గ్రీసు పూసిన ప్లాస్టిక్ పేపర్లను భూమి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తు వరకు కాండం చుట్టూ చుట్టాలి.
మామిడిలో సస్యరక్షణ
మామిడిలో సస్యరక్షణ
మామిడిలో సస్యరక్షణ


