తటస్థులే టార్గెట్
తొలివిడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగియడంతో అభ్యర్థులు తటస్థ ఓటర్లపై దృష్టి సారించారు. వార్డుల వారీగా ఓట్లు లెక్కగడుతూ ఓట్లు రాబ్టేందుకు తాయిలాలు సమర్పించుంకుటున్నారు.
షాద్‌నగర్: మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు గంటల సమయమే ఉంది. అభ్యర్థులు తమ ప్రచారాలను మమ్మరం చేశారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే నిర్వహించిన ప్రచారాల్లో పలు వర్గాల మద్దతు కూడగట్టుకున్న నేతలు పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో తటస్థ ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
వేల సంఖ్యలో తటస్థ ఓటర్లు
యువకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పలు రకాల వ్యాపారవర్గాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పరిశ్రమల్లో పనులు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఓటు హక్కు పొందారు. వేల సంఖ్యలో ఉన్న ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు చెబితే వారి ఓట్లు రాబట్టుకోవచ్చో తెలుసుకుని వారిని ఆశ్రయిస్తున్నారు.
తాయిలాలతో ఎర
ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పగలు, రాత్రి లేకుండా ప్రతీ గల్లీ తిరుగుతూ ప్రచారం కొనసాగిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడుగా రాజకీయాలకు అతీతంగా ఉండే వారిని, పెద్ద కుటుంబాల వారిని, ఉద్యోగులను అభ్యర్థులు కలుస్తూ పాట్లు పడుతున్నారు. సామాజిక వర్గాల వారి ఓట్లను గంపగుత్తగా దండుకునేందుకు అభ్యర్థులు శత విధాలా యత్నిస్తున్నారు. కుల సంఘాల ఓట్లు కోసం అభ్యర్థులు తాయిలాలు ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. కుల పెద్దలను కలుస్తూ మద్దతు కూడగట్టుకుంటున్నారు.
వలస ఓటర్లపై ఫోకస్
షాద్‌నగర్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, హరియాణా, ఛత్తీస్‌ఘడ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు ఈ ప్రాంతానికి వలస వచ్చారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లో పని చేసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. పెయింటింగ్, ఉడ్‌వర్క్, మార్బుల్, సీలింగ్, డిజైనింగ్ తదితర నైపుణ్య పనులు చేసే వారు సైతం ఈ ప్రాంతంలో ఓటు హక్కు పొందారు. వీరంతా పార్టీలకు అతీతంగా తమ పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నిక ఏదైనా వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. ఈ ఓట్లు రాబట్టేందుకు నేతలు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతల తటస్థ ఓటర్లపై వల విసురుతున్నారు.
పల్లె ఓటర్లకు పట్నంలో దావత్
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నివసిస్తున్న పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని శివారులో ఈ హడావుడి కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపార రీత్యా పలువురు నగరంలో నివసిస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఓట్లను రాబట్టుకునే పనిలో పడ్డారు. నేరుగా నగరంలో వారు నివసిస్తున్న అడ్రస్‌లకు వెళ్లి ట్రాన్స్‌పోర్టు ఖర్చులు భరిస్తామని ఓటుకు సైతం కొంతమొత్తం ముట్టజెప్పుతామని హామీ ఇస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా యూపీఐ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరిని ఒకచోట చేర్చి దావత్‌లు సైతం ఇస్తున్నట్లు సమాచారం. మండలంలోని చింతలపల్లికి చెందిన ఓ అభ్యర్థి ఇటీవల దావత్ ఇచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఆకుతోటపల్లికి చెందిన పలువురు అభ్యర్థులు ఓటర్లను కలుసుకుని వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
తటస్థులే టార్గెట్
తటస్థులే టార్గెట్


