తాళం వేసిన ఇంటికి కన్నం | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంటికి కన్నం

Dec 10 2025 9:38 AM | Updated on Dec 10 2025 9:38 AM

తాళం వేసిన ఇంటికి కన్నం

తాళం వేసిన ఇంటికి కన్నం

బంగారం, వెండి, నగదు చోరీ

పరిగి: తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన ఘటన పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయంతి కాలనీలో నివాసముంటున్న మహేందర్‌ దోమ సబ్‌ స్టేషన్‌లో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బంధువుల ఇంట్లో అయ్యప్ప పూజ ఉండటంతో సోమవారం సాయంత్రం కుటుంబం మొత్తం ఇంటికి తాళం వెళ్లిపోయారు. మంగళవారం సాయంత్రం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లో ఉన్న 6.5 తులాల బంగారు, 10 తులాల వెండి, రూ.70 వేల నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల హార్డ్‌ డిస్క్‌ను సైతం తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహనక్రిష్ణ తెలిపారు.

వైద్య విద్యార్థుల ధర్నా విరమణ

సమస్యల పరిష్కారానికి డీఎంఈ హామీ

ఇబ్రహీంపట్నం రూరల్‌: తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మహేశ్వరం మెడికల్‌ కాలేజీ విద్యార్థులు డీఎంఈ (డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌) శివరామప్రసాద్‌ హామీతో శాంతించారు. రెండో రోజైన మంగళవారం వీరు నిర్వహించిన ధర్నాకు జూడాల సంఘం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల విద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఇక్కడి పరిసరాలు అడవులను తలపిస్తున్నాయని, కనీసం తాగునీరు, బస్సు సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొడంగల్‌లో సకల ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం, ఇక్కడి పరిస్థితిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. డీఎంఈ శివరామప్రసాద్‌ కాలేజీకి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. క్యాంపస్‌లోనే హాస్టల్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థుల రక్షణ కోసం సెక్యూరిటీ, పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్‌ మొబైల్‌ తనిఖీలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రవాణా సౌకర్యం కోసం క్యాంపస్‌ నుంచి ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. మరో ఆరు మాసాల్లో సొంత భవన నిర్మాణం పూర్తవుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పేరెంట్స్‌ కమిటీ, జూడాలతో కలిసి విద్యార్థులను శాంతింపజేసి, సమ్మెను విరమింపజేశారు. పేరెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ చారి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోతే 50వేల మంది పేరెంట్స్‌తో మహేశ్వరం మెడికల్‌ కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. మెడికో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు రమేష్‌ కుమార్‌, కోశాధికారి రవికుమార్‌, సంయుక్త కార్యదర్శి రత్నప్రసాద్‌ ఉన్నారు.

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌

అనంతగిరి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆరోపించారు. ఈమేరకు వికారాబాద్‌ పట్టణంలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో విజయ్‌ దివస్‌ ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పార్టీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోపాల్‌, వర్కింగ్‌ అధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, అంజయ్య, షఫీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement