మందు.. విందు! | - | Sakshi
Sakshi News home page

మందు.. విందు!

Dec 9 2025 10:46 AM | Updated on Dec 9 2025 10:46 AM

మందు.. విందు!

మందు.. విందు!

పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం

వికారాబాద్‌: పంచాయతీ ఎన్నికలు రసవత్తర స్థాయికి చేరుకున్నాయి. తొలివిడత పోలింగ్‌కు కేవలం రెండు రోజుల గడువే ఉంది. దీంతో ప్రచారం తోపాటు ప్రలోభాలు ఊపందుకున్నాయి. మందు.. విందుతో ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. తాండూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని తాండూరు, యాలాల, పెద్దేముల్‌, బషీరాబాద్‌, కొడంగల్‌ సెగ్మెంట్‌లోని కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట్‌, దుద్యాల్‌ మండలాల్లో పోలింగ్‌ జరగనుంది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్‌.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారుల మధ్య పోటీ కనిపిస్తుండగా అక్కడక్కడ బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే.. ఎంత ఖర్చయినా సరే అనే రీతిలో ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేకున్నా మిత్రులు, బంధువుల వద్ద తీసుకోవడమో.. లేదా అప్పు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. ఆరున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా ప్రతి అభ్యర్థి ఏదో ఒక పార్టీకి అనుబంధంగానే బరిలోకి దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీదారుల ప్రవర్తన, సేవాభావం, అందుబాటులో ఉండేవారినే ఓటర్లు ఆదరిస్తారు. అయినా ప్రలోభాలు కొనసాగుతున్నాయి.

తొలి విడతలో 262 జీపీలకు..

జిల్లాలో 594 పంచాయతీలు ఉండగా తొలి విడతలో 262 సర్పంచ్‌, 2,198 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 39 పంచాయతీలు, 652 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 223 జీపీలకు ఈ నెల 11న పోలింగ్‌ జరగనుంది. అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిత్యం మందు, విందుతో దావత్‌లు చేస్తున్నారు. కొంత మంది ఏకంగా కిచెన్లు ఏర్పాటు చేసి విందులిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మధ్యాహ్నం నుంచే ఈ విందు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దావత్‌లకు ఫాంహౌస్‌లు, వ్యవసాయ క్షేత్రాలు, పంట పొలాలు, రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. మద్దతు దారులు చేజారి పోకుండా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే ఓటుకు ఇంతని లెక్కలేసి పోలింగ్‌కు ఒకటి రెండు రోజులముందు డబ్బు పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోతోంది. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు నేరుగా మద్యాన్ని చేరవేస్తున్నట్లు సమాచారం.

కొరవడిన నిఘా

ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులను నిఘా విభాగం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపిండం లేదు. ఇదే అదనుగా భావించిన అభ్యర్థులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యయా న్ని తగ్గించడానికి ప్రభుత్వం పరిశీలకులను నియమించినా పోటీదారులు ఖాతరు చేయడంలేదు. బహిరంగంగానే మద్యం, మందు పంపిణీ చేస్తూ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. గ్రామాల్లో పోలీసుల నిఘా కనిపించడంలేదు.

తొలి విడత పోలింగ్‌కు కేవలం రెండు రోజులే..

ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో అభ్యర్థులు

ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న ఆలోచనలో పోటీదారులు

రసవత్తరంగా మారిన పోరు

చివరి రెండు రోజులే కీలకం

పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడు దశలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ముగిసింది. నేటితో చివరి విడత నామినేషన్ల ఉపసంహరణ ముగియనుంది. పోటీ తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వారం పది రోజుల నుంచే మందు, విందుతో ముంచెత్తుతున్నారు. కులాలు, యువజన, మహిళా సంఘాల వారీగా మాట్లాడుకుని డబ్బులు పంచుతున్నారు. మొదటి విడత పోలింగ్‌కు రెండు రోజల ముందు డబ్బు, మద్యం పంచేందుకు అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement