పోలింగ్‌కు సిద్ధం కండి
అనంతగిరి: జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్‌లో ఏ చిన్న పొరపాటు జరగకుండా చూసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎన్నికలు జరగనున్న 8 మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది సమయపాలనను పాటిస్తూ, సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ ఉన్న నేపథ్యంలో 10వ తేదీ ఉదయం 8 గంటలకే డిస్టిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నంఎన్నికల సామగ్రితో కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. చెక్ లిస్ట్‌కు అనుగుణంగా బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరగాలని సూచించారు. ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం ఎస్పీ స్నేహమెహ్ర మాట్లాడుతూ.. మొదటి విడత పోలింగ్‌కు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, అడిషనల్ ఎస్పీ రామునాయక్, డీఆర్‌ఓ మంగీలాల్, డీపీఓ జయసుధ, నోడల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వొద్దు
కలెక్టర్ ప్రతీక్ జైన్


