వాన.. రైతన్న హైరానా
కాలం ఆలస్యమైనా.. కర్షకులకు కొంత ఊరట లభించింది. పంటలు బాగానేపండాయి. ఆశించిన మేర దిగుబడులు వస్తాయని భావించారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో కుండపోత వర్షాలు వారి ఆశలను అడియాశలుగా మార్చాయి.
దోమ: పంటలు కోతకు వచ్చే సమయంలో పడుతున్న వర్షాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటలు.. కళ్లముందే నేలపాలవుతుండటంతో.. కన్నీటి పర్యంతం అవుతున్నారు. దేవుడా ఇదేం శిక్ష అంటూ దీనంగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఒకవైపు ఉరుముతున్న వరుణుడు.. మరోవైపు వేధిస్తున్న కూలీల కొరత. తప్పని పరిస్థితుల్లో కొందరు రైతులు యంత్రాలను ఆశ్రయించి దిగుబడులను రాబట్టుకొంటుండగా.. సన్న చిన్న కారు రైతులు.. కూలీలపైనే ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆందోళన చెందుతున్నారు. మంగళ, బుధవారాల్లో మండలంలో భారీ వర్షం పడింది.. మరింత కలవరానికి గురిచేసింది.
16,210 ఎకరాల్లో వరి
మండలంలోని 36 గ్రామాల్లో వానాకాలం సీజన్‌లో 16,210 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంటలు కోతకు వచ్చాయి. కానీ కూలీల కొరత కారణంగా యంత్రాలతో పనులు చేయిస్తున్నారు. అయితే వాతావరణంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో కోతలు కోయాలా? వద్దా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. అయితే దిగుబడి చేతికొచ్చిన వారు.. అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కుప్పలుగా పోసి ఆరబెట్టుకొని, తేమ శాతంతో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. వర్షాలు వెంటాడుతున్నాయి. దీంతో చేసేది లేక.. దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
కుండపోత వర్షాలు..
పంట దిగుబడిపై దిగాలు
వేధిస్తున్న కూలీల కొరత
భారంగా మారిన యంత్రాల అద్దె
ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
పెరిగిన యంత్రాల అద్దె
కూలీల కొరత భారంగా మారడంతో రైతులు వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుక్ను వాటి యజమానులు.. అద్దెలను పెంచేయడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. గతేడాది టూ వీలర్ హార్వెస్టర్‌కు రూ.2,200 ఉండగా.. ప్రస్తుతం రూ.2,500 పెంచారు. ఫోర్ వీలర్ హార్వెస్టర్‌కు రూ.2,800 ఉండగా.. ప్రస్తుతం రూ.3 వేలను వసూలు చేస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. అద్దె భారంగా మారిందంటున్నారు.


