పగలే విద్యుత్ వెలుగులు
పట్టించుకోని అధికారులు
నవాబుపేట: గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలుగుతున్నాయి. విద్యుత్ పొదుపుగా వాడుకోవాలని చెబుతున్న అధికారులే.. పట్టపగలు వీధి దీపాలు జిగేల్‌మంటున్నా.. అరికట్టలేక పోతున్నారు. ఇందుకు నిదర్శనం నారెగూడలో పగలే వెలుగుతున్న వీధి దీపాలే..
అదనపు భారం
పంచాయతీల్లో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. పాలకవర్గాలు లేని కారణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. దీంతో 15 నెలలుగా పంచాయతీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. వీధి దీపాలు, తాగునీటి పథకాలు తదితర బిల్లులను పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి నిధుల లేమి తోడు నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలతో అదనపు భారం పడుతోంది. చాలా గ్రామాల్లో వీధి దీపాలకు ఆన్‌ఆఫ్ స్విచ్‌లు లేవు. వీటికి ప్రత్యేకించి మూడో తీగను ఏర్పాటు చేసి, ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయాలి. కానీ అవి ఎక్కడా కనిపించడం లేదు. దాంతో విద్యుత్ దుబారా అవుతోంది. విద్యుత్ అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై ఏఈ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. ఇప్పటికే చాలా గ్రామాల్లో మూడో తీగను ఏర్పాటు చేశామని, మరిన్ని గ్రామాల్లో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూడో తీగ ఉన్న గ్రామాల్లో పంచాయతీ కార్మికులకు అవగాహన లేక.. స్ట్రీట్ లైట్ తీగలకు కాకుండా.. గృహాలకు సరఫరా చేసే ఫేజ్ తీగకు అమర్చారని, తద్వారా వీధి దీపాలు నిరంతరం వెలుగుతున్నాయని వివరణ ఇచ్చారు. కార్మికులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.


