ఆ పీడకల వెంటాడుతోంది
కూరగాయలు విక్రయించడానికి ఇంటి నుంచి హైదరాబాద్ బయలు దేరిన నా భర్త ఆ తర్వాతి గంటలోనే శవమై వచ్చాడు. ఆయన చనిపోయి 20 ఏళ్లు కావస్తోంది. అప్పటికే మాకు ముగ్గురు చిన్న పిల్లలు. ఇంటి పెద్ద దిక్కును కోల్పొవడంతో జీవితం భారంగా మారింది. ఉన్నకొద్దిపాటి పొలంలో కాయగూరలు పండిస్తూ, ఖాళీ సమయంలో కూలీపనులు చేసుకుంటూ ఇద్దరు కొడుకులను పెంచాను. ఇటీవలే కూతురి పెళ్లి చేశారు. ఒక వైపు భర్తను కోల్పోయి.. మరో వైపు పిల్లలను సాకడానికి పడరాని పాట్లు పడ్డాను. ఆయనే ఉంటే మాకిన్ని కష్టాలు వచ్చేవి కావు. మీర్జాగూడ తాజా ఘటనతో మళ్లీ ఆ పీడకల నా కళ్లముందు ఆవిష్కృతమైంది.
– బొడ్డుగారి లక్ష్మీజంగారెడ్డి
నా కష్టం మరెవరికీ రావొద్దు
మేం ఏళ్లుగా కూరగాయ పంటలు సాగు చేస్తుంటాం. 20 ఏళ్ల క్రితం నా భర్త రాములు కూరగాయాలు విక్రయించేందుకు రాత్రిపూట డీసీఎంలో మార్కెట్‌కు బయలుదేరాడు. ఆలూరు గేట్ వద్దకు చేరుకోగానే డీసీఎంను ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నా భర్త సహా మరో ఇద్దరు రైతులు చనిపోయారు. నాకు ఇద్దరు పిల్లలు. నిరుపేద కుటుంబం. భర్తను కోల్పోవడంతో నా బతుకు రోడ్డున పడింది. పిల్లలను పోషించేందుకు ఎన్నో కష్టాలను పడాల్సి వచ్చింది. ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు. మీర్జగూడ బస్సు ప్రమాద ఘటనతో 20 ఏళ్ల క్రితం జరిగిన నా భర్తకు జరిగిన ప్రమాదం నా కళ్లముందు కదలాడుతోంది.
– గొల్ల లక్ష్మీరాములు, నారెగూడ
మాకున్న అర ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని కూరగాయలు సాగు చేసేవాళ్లం. అప్పట్లో మా పొలంలో కూలీ పనులకు రోజుకు నలుగురు చొప్పున వచ్చేవారు. కూరగాయలను మార్కెట్‌కు తీసుకెళ్తూ నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నా భర్త మందుల నర్సింలు మృతి చెంది పదేళ్లు అవుతోంది. మేం మా కొడుకును బాగా చదివించాలని అనుకున్నాం. భర్త చనిపోయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తాయి. కొడుకును చదివించ లేకపోయాను. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నా. ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పింది. కానీ పైసా ఇవ్వలేదు.
– మందుల నాగమణి
ఆ పీడకల వెంటాడుతోంది
ఆ పీడకల వెంటాడుతోంది


