పోలీసులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
పరిగి: పోలీసుల తీరుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధ వారం నజీరాబాద్‌తండాలో నిర్వహించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ సమయంలో కార్యకర్తలు, జనం ఒక్కసారిగి డిప్యూటీ సీఎం వద్దకు తోసుకొచ్చారు. ఇది గమనించిన స్థానిక ఎమ్మె ల్యే రామ్మోహన్‌రెడ్డి మైక్ అందుకుని, కార్యకర్తలు పక్కకు జరగాలని కోరారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆయనే వచ్చి కార్యకర్తలను అదుపుచేశారు. దీంతో పోలీసులు ఏం చేస్తున్నారంటూ భట్టి మండిపడ్డారు.
విద్యుదాఘాతంతో
ఇల్లు దగ్ధం
బంట్వారం: షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మండలం పరిధి సల్బత్తాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్నం అనంతమ్మ.. ఇంటికి తాళం వేసి, పొలం పనులకు వెళ్లింది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఆమె కుమారుడు వెంకటేశ్.. స్థానికుల సహాయంతో విద్యుత్ సరఫరా నిలిపి, నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. అప్పటికే రిఫ్రిజిరేటర్, తదితర సామగ్రి కాలిపోయింది. ఈ ఘటనలో రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు తెలిపింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది.
సంతానం కలగలేదని.. తనవు చాలించాడు
కొడంగల్ రూరల్: సంతానం కలగ లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కొడంగల్ పట్టణం లాహోటి కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరు మున్సిపాలిటీ పరిధి రెనివట్ల గ్రామానికి చెందిన ఓగ్గని మల్లప్ప(40), హైదరబాద్‌లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. వివాహమై 20 ఏళ్లు అయింది. కానీ సంతానం కలగలేదు. పిల్లలు పుట్టడం లేదని తరచూ.. బాధపడేవాడు. ఈ నేపథ్యంలో నగరం నుంచి గ్రామానికి వస్తున్న క్రమంలో.. కొడంగల్‌లోని లాహోటి కాలనీలో పార్కుకు సమీపంలో ఓ చెట్టుకు ఊరివేసుకున్నాడు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో అటుగా వెళ్తున్న వారు చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు మృతదేహం వద్ద లభించిన ఆధారంగా కటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
ధర్నా చేసిన వారిపై
కేసు నమోదు
తాండూరు టౌన్: తాండూరు నుంచి హైదరాబాద్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారంటూ 25 మందితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
శంకర్‌పల్లి: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని బుధవారం సాయంత్రం మోకిల పోలీసులు పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్నికొందరు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. అయితే బుధవారం సాయంత్రం 33 టన్నులతో నగరం నుంచి వస్తున్న లారీ.. మండల పరిధి మిర్జాగూడ వద్ద తూకం వేసేందుకు ఆగింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు లారీని తనిఖీ చేశారు. రేషన్ బియ్యంగా గుర్తించి, డ్రైవర్ ఆదిత్య యాదవ్(22), క్లీనర్ భిక్షా యాదవ్(20)లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నగరానికి చెందిన ఇబ్రహీం.. ద్వారా బియ్యం వచ్చాయని తెలిపారు. పోలీసులు లారీని సీజ్ చేసి, ఠాణాకు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని సీఐ తెలిపారు.


