బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా
తాండూరు రూరల్: బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కరన్‌కోట్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. డల పరిధి చంద్రవంచ గ్రామానికి చెందిన చింతలకడి దత్తు(16), అతని మామ చింతలకడి జగదీష్, చెల్క జగదీష్, కుమ్మరి కాలేష్‌లు ఆటోలో తాండూరుకు వచ్చారు. సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తున్న క్రమంలో చంద్రవంచ గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న బాలుడు దత్తు రోడ్డుపై పడి, తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మామ జగదీష్ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జగదీష్ పరిస్థితి విషమించడంతో.. నగరంలోని గాంధీకి తరలించారు. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కరన్‌కోట్ పోలీసులు వెంటనే.. ఘటనా స్థలానికి వెళ్లారు. వివరాలు తెలుసుకొని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాథోడ్ వినోద్ తెలిపారు. ఆటో యజమాని అనిల్‌గా గుర్తించారు.
బాలుడి మృతి, ఒకరి పరిస్థితి విషమం
దత్తు.. లేవరా
ఒక్కగానొక్క కొడుకు. తండ్రి లేడు. కూలీ పనులు చేసుకుంటూ.. ఆ తల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి. దత్తు లేవరా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం.. పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామానికి చెందిన చింతలకడి లక్ష్మప్ప, నర్సమ్మలకు ముగ్గురు కుమార్తెలు భాగ్య, రేణుక, హిందుతో పాటు కుమారుడు దత్తు(16) ఉన్నాడు. వీరి తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయాడు. నాటి నుంచి నర్సమ్మే అన్నీ తానే అయింది. ఆటో రూపంలో కొడుకు దుర్మరణం చెందడంతో ఆ తల్లి తల్లడిల్లింది. కాగా.. దత్తు మృతదేహాన్ని ఆటోలో గ్రామానికి తరలించారు. ప్రమాదంలో చనిపోవడంతో.. పోలీసులకు కుటుంబీకులకు నచ్చజెప్పి.. శవాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
బైక్‌ను తప్పించబోయి ఆటో బోల్తా


