కొండంత స్వచ్ఛత | - | Sakshi
Sakshi News home page

కొండంత స్వచ్ఛత

Oct 29 2025 9:39 AM | Updated on Oct 29 2025 9:39 AM

కొండం

కొండంత స్వచ్ఛత

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కార్యక్రమం కేవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో16 స్వచ్ఛ ట్రక్కులు చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 480 పాఠశాలకు ప్రయోజనం

ఓ ఆలోచన ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్ల రూపు రేఖల్నే మార్చేసింది.. పదేళ్ల క్రితం ఒక స్కూల్‌లో ప్రారంభమైన ఈ యజ్ఞం దినదినాభివృద్ధి చెందుతూ ఏకంగా 16 మండలాల్లోని 480 పాఠశాలలకు విస్తరించింది. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. కేవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛత కార్యక్రమంపై ప్రత్యేక కథనం..

సర్కారు బడుల్లో మరుగుదొడ్ల శుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛతా సేవలు

వికారాబాద్‌: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలనే ఏకై క లక్ష్యంలో 2015లో కేవీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్వచ్ఛ విద్యాలయం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల్లోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం అప్పట్లో రూ.6 లక్షలు వెచ్చించి ఓ ట్రక్‌ను కొనుగోలు చేశారు. అందులో మరుగుదొడ్లను క్లీన్‌ చేసేందుకు అవసరమైన పరికరాలన్నీ అమర్చారు. ప్రస్తుతం ఈ సేవలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 16 మండలాలకు విస్తరించాయి. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని 480 ప్రభుత్వ పాఠశాలల్లో కార్యక్రమం అమలవుతోంది. గతంలో మూత్రశాలల నిర్వహణ అధ్వానంగా ఉండేది. విద్యార్థులే శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది. కొన్ని చోట్ల నీటి వసతి కూడా ఉండేది కాదు.. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని కేవీఆర్‌ ఫౌండేషన్‌ భావించింది. ఇందుకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వరంలా మారింది.

మూత్రశాలల నిర్మాణం

2010 నుంచి ఇప్పటి వరకు అనేక పాఠశాలల్లో కేవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మూత్రశాలలు, మరుగుతొడ్లు నిర్మించారు. వాటికి నీటి వసతి కూడా కల్పించారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. రెండేళ్ల క్రితం మూత్రశాలల నిర్వహణకు స్కావేంజర్లను కూడా నియమించారు. ప్రభుత్వం వారికి వేతనాలు ఇవ్వకపోవడంతో సేవలు ఆగిపోయాయి. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈ క్రమంలో కేవీఆర్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చి పాఠశాలల మరుగుదొడ్ల బాధ్యతలను తీసుకుంది. దీంతో విద్యార్థుల సమస్య తీరింది.

16 ట్రక్కుల ద్వారా సేవలు

ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సొంత నిధులు వెచ్చించి 16 స్వచ్ఛ ట్రక్కులను కొనుగోలు చేశారు. ఒక్కో దాని కోసం రూ.6 లక్షల వరకు వెచ్చించారు. ప్రస్తుతం 16 మండలాల్లో ఒకో వాహనం చొప్పున సేవలందిస్తున్నాయి. ప్రతి వాహనానికి ఒక వంలంటీర్‌ను నియమించారు. అతనికి జీతం ఇవ్వడంతోపాటు వాహన ఖర్చులు(డీజిల్‌), మూత్రశాలలను శుభ్రం చేసేందుకు ఉపయోగించే ఫినాయిల్‌, ఇతర సామగ్రిని కేవీఆర్‌ ఫౌండేషన్‌ సమకూరుస్తోంది. ఒక్కో వాహనం ద్వారా రోజుకు 30 పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్నారు.మూత్రశాల లు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని పాఠశాలల్లో కొనసాగాలి

కేవీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛతా ఈ ముబైల్‌ కార్యక్రమం కొనసాగుతోంది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని వందలాది ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ బడుల్లో కొనసాగించాలి. స్వచ్ఛత అనేది విద్యార్థుల హక్కు.

– కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,

కేవీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌, చేవెళ్ల ఎంపీ

కొండంత స్వచ్ఛత1
1/1

కొండంత స్వచ్ఛత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement