మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
అనంతగిరి: జిల్లాలో మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అడిషనల్ కలెక్టర్ సుధీర్ తెలిపారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా మహా సమాఖ్య నుంచి సీనియర్ సీఆర్‌పీలు వచ్చారని.. వీరు క్షేత్రస్థాయిలో 15రోజుల పాటు పర్యటించి మహిళా సంఘాల బలోపేతంపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. మంగళవారం జిల్లా సమాఖ్యలో డీఆర్‌డీఓ, డీపీఎం, ఏపీఎంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గ్రామ, మండల సమాఖ్యల బలోపేతం గురించి, గ్రామ సంఘాల పటిష్టతపై, బుక్ కీపింగ్, పేదరిక నిర్మూలనపై ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై చర్చిస్తారన్నారు. అలాగే మండల సమాఖ్యలో మండల సమావేశ విధానం, ప్రణాళికలు, సలహాలు సూచనలు ఇస్తారని తెలిపారు. ప్రతి మండల సమాఖ్యలో రెండు రోజులు, గ్రామ సంఘంలో రెండు రోజులు మొత్తం 15 మండల సమాఖ్యలు, 13 గ్రామ సమాఖ్యలు, 14 రోజులు సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 15వ రోజు జిల్లా సమాఖ్యలో రివ్యూ నిర్వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్‌డీఓ నర్సింలు, డీపీఎం నర్సింలు, ఏపీఎంలు సవిత, రాజు, మధుకర్, గోపాల్, బాలయ్య, సీసీలే, వీఏవోలు, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.


