జోరుగా ఇసుక దందా
పరిగి: రోజురోజుకూ నిర్మాణాలు పెరుగుతుండటంతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకొని కొంత మంది వ్యాపారులు అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద మొత్తంలో ఇసుక అవసరం ఏర్పడింది. దీంతో కుల్కచర్ల, దోమ, పరిగి మండలాల్లో ఫిల్లర్ ఇసుక తయారు చేసి సరఫరా చేస్తున్నారు. పరిగి పట్టణంతో పాటు బొంరాస్‌పేట్, యాలాల, కోయిల్‌సాగర్ నుంచి యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. పోలీసులకు విషయం తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తప్పనిసరి కావడంతో పలు వాగుల నుంచి రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఈ విషయమై పరిగి డీఎస్పీశ్రీనివాస్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తామని తెలిపారు. ఎవరైనా ఇసుక తరలిస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


