దారులు బంద్
చినుకు పడితే చాలు రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీగా వరద నీరు చేరడంతో అటుఇటు దాటడానికి వీలు లేకుండా మారుతోంది. బ్రిడ్జిలను విస్తరించాలని స్థానికులు మొర పెట్టుకున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు.
నవాబుపేట: మండలంలోని ఏడు గ్రామాల ప్రజలకు రైల్వే అండర్ బ్రిడ్జిలు కొత్త సమస్యను సృష్టిస్తున్నాయి. మండలంలో సుమారు 25 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ ఉంటుంది. దానికి సమీపంలోనే 20 కిలోమీటర్ల వరకు మూసీ నది ప్రవహిస్తుంది. మండలాన్ని రైల్వే ట్రాక్, మూసీనది రెండుగా చీల్చుతున్నాయి. దాంతో పలు గ్రామాల ప్రజలు ఇవతలి నుంచి అవతలికి వెళ్లడానికి రైల్వే ట్రాక్, మూసీ నది దాటాల్సిందే. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. వర్షాలకు కురిసినప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
స్తంభించిన రాకపోకలు
మండల పరిధిలోని ముబారక్‌పూర్, ఎల్లకొండ, గొల్లగూడ, పులుమామిడి, లింగంపల్లి, నారెగూడ, అక్నాపూర్, చిట్టిగిద్ద రైల్వేస్టేషన్, చించల్‌పేట, గేట్‌వనంపల్లి గ్రామాల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు చిన్నగా నిర్మించడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు చేసి సమస్య తీవ్రరూపం దాల్చింది. బ్రిడ్జిలను వెడల్పుగా నిర్మించాలని అనేకసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సైతం పలుమార్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖలు రాసి సమస్య పరిష్కరించాలని కోరారు.
అండర్ బ్రిడ్జితో అవస్థలు
యాలాల: ప్రతి 20 నిమిషాలకోసారి పడే రైల్వే గేటు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జితో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. చిన్నపాటి చినుకులకే అండర్ బ్రిడ్జి ప్రదేశంలో భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. సుమారు మూడు నుంచి నాలుగు అడుగుల మేర నిలుస్తున్న వరదనీటితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. యాలాల మండలంలోని కోకట్ నుంచి బామ్లానాయక్ తండా మార్గంలో గతంలో రైల్వే గేటు ఉండేది. ప్రతి 20 నిమిషాలకోసారి రైళ్ల రాకపోకలతో గేటు మూసేవారు. బషీర్‌మియాతండా, బామ్లానాయక్‌తండా, రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రజలతో పాటు చాలా మంది కోకట్ మీదుగా మండల కేంద్రానికి వెళ్లేవారు. దీంతో ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను దూరం చేసేందుకు రైల్వే శాఖ అధికారులు అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.
మూడున్నరేళ్ల పాటు పనులు!
అండర్‌బ్రిడ్జి నిర్మాణ పనులు సుమారు మూడున్నరేళ్ల పాటు సాగాయి. పాత రైల్వే గేటు కింది భాగంలో భారీగా తవ్వి పనులు చేపట్టారు. నత్తనడకన సాగడంతో చాలా మంది వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు మానేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అండర్‌బ్రిడ్జి ప్రదేశంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. సుమారు మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు నిలవడంతో దాదాపు రాకపోకలకు అవకాశం లేకుండా పోతుంది. ఓ ప్రైవేట్ అంబులెన్స్ వరదనీటిలో ఇరుక్కుపోయింది. ఈ విషయంలో రైల్వే శాఖ అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద
భారీగా చేరుతున్న వరద
వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం
సమస్య పరిష్కరించాలని
స్థానికుల విజ్ఞప్తి
స్పందన లేదు
నవాబుపేట, శంకర్‌పల్లి మండలాల్లో దాదాపు 40 కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్ ఉంది. రెండు రైల్వే గేట్లు, శంకర్‌పల్లి వద్ద బ్రిడ్జి మాత్రమే ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అండర్ బ్రిడ్జిల వద్ద భారీగా వరద నీరు చేరడంతో నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్, చిన్న బ్రిడ్జిలను వెడల్పు చేయాలని రైల్వే మంత్రి, బోర్డు చైర్మన్, జీఎంలకు వినతిపత్రాలు ఇచ్చాను. కానీ స్పందన లేదు.
– కాలె యాదయ్య, ఎమ్మెల్యే, చేవెళ్ల
చినుకు పడితే
చినుకు పడితే
చినుకు పడితే


