యథేచ్ఛగా చెట్ల నరికివేత!
తహసీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం
తాండూరు రూరల్: మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్లను మంగళవారం పాములు ఉన్నాయనే సాకుతో తొలగించారు. ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్లనే కార్యాలయ సిబ్బంది దగ్గరుండి మరి నరికి వేయడంతో మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తహసీల్దార్‌గా పని చేసిన చిన్నప్పలనాయుడు కార్యాలయ ఆవరణలో దాదాపు పదుల సంఖ్యలో చెట్లను పెంచారు. 50కి పైగా రంగు రంగుల పూల తొట్టెలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించారు. అంతేకాకుండా కార్యాలయం ముందు, వెనకాల ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో చెట్లను తొలగించాలంటే ముందుగా అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా యథేచ్ఛగా చెట్లను నరికి వేస్తున్నారు. పాముల భయంతో చెట్లను నరకడం ఏంటని, వాల్టా చట్టం అమలు రావడం లేదని స్థానికులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.
పాముల భయంతో..
తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటివరకు మూడు పాములు వచ్చాయి. తాజాగా ఆదివారం నాగు పాము రావడంతో సిబ్బంది చంపేశారు. కార్యాలయం ముందు, వెనకాల ఉన్న చెట్లు కార్యాలయంపై పడుతున్నాయనే తొలగిస్తున్నాం. అటవీ శాఖకు కూడా లేటర్ రాస్తాం. చట్టాన్ని అతిక్రమించలేదు.
– తారాసింగ్, తహసీల్దార్, తాండూరు


