విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు టౌన్: విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం పట్టణంలోని తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో సింధు డిగ్రీ కళాశాల ఫ్రెషర్స్‌డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు బహుళ రంగాల్లో ప్రావీణ్యత సాధించాలని సూచించారు. అకాడమిక్ విద్యతో పాటు క్రీడలు, పరిశోధనలు, పెయింటింగ్, సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఉన్నత చదువులు చదివి కళాశాలకు, కన్నవారికి పేరు ప్రఖ్యాతులు తేవాలన్నారు. పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. అనంతరం గత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు రంగారావు, ప్రిన్సిపాల్ విజయాదేవి, వైస్ ప్రిన్సిపాల్ అమరేందర్, డైరెక్టర్ సింధు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


