అనంతగిరి జాతరకు వేళాయె..
● 31 నుంచి పెద్ద జాతర
● ఏర్పాట్లు ముమ్మరం
అనంతగిరి: అనంతగిరి గుట్ట అనంత పద్మనాభ స్వామి ఆలయ కార్తీక మాస పెద్ద జాతర.. ఈ నెల 31 నుంచి నవంబర్ 14 వరకు జరగనుందని ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, ఈఓ టి.నరేందర్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ధ్వజారోహణంతో జాతర ప్రారంభమై.. వచ్చే నెల 2న కార్తీక ఏకాదశి, 3న రాత్రి 7గంటలకు తులసి వివాహం, 5న పౌర్ణమిని పురస్కరించుకుని సాయంత్రం 6.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం, రాత్రి 9.30 గంటలకు స్వామివారి రథోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. 6న ఉదయం 11గంటలకు గరుడ వాహన సేవ, 7న ఉదయం 11 గంటలకు ముత్యాల పందిరి వాహనసేవ, 8న ఉదయం 11 గంటలకు గజ వాహనోత్సవం, 14న ఉదయం 11గంటలకు ఆలయ పుష్కరిణిలో చక్రతీర్థంతో జాతర ముగుస్తుందని వివరించారు. కాగా.. ఏటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు జరిగే జాతరకు జిల్లాతో పాటు.. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, జహిరాబాద్, సంగారెడ్డి, షాద్‌నగర్, కొడంగల్, నారాయణపేట ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి రానున్నారు.
ఆలయ చరిత్ర
వికారాబాద్ పట్టణానికి సమీపంలోని అనంతగిరి ఆలయం.. ద్వాపర యుగం నాటిదని, సుమారు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఆలయానికి మూడు పురాణాగాథలు ఉన్నాయి. స్వామి దర్వనకోసం మార్కండేయ మహర్షి తపస్సు చేశాడని, దీంతో భగవంతుడు శ్రీకృష్ణుడి అవతారంలో మహర్షికి దర్శనమిచ్చాడని చరిత్ర చెబుతోంది. అనంత పద్మనాభుడిగా సాలగ్రామ శిలారూపంలో కూర్చున్నట్లుగా స్కాంద పురాణాన్ని బట్టి తెలుస్తోంది. పూర్వం అనంతగిరి నుంచి కాశీకి వెళ్లేందుకు గుహ ఉండేదని, అందులోంచే నిత్యం మార్కండేయుడు కాశీకి వెళ్లి, విశ్వనాథున్ని దర్శనం చేసుకుని, గంగాజలం తెచ్చి స్వామి వారికి అభిషేకం చేసేవారని ప్రతీతి. కళియుగం ప్రారంభమయ్యాక ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారిని అర్తిస్తే స్వయంగా గంగా అనంతగిరి క్షేత్రానికి వచ్చి, పుష్కరిణిగా మారింది. ఇక్కడ స్నానం చేస్తే గంగా స్నాన ఫలం అని స్వామిని దర్శించుకుంటే బద్రి యాత్ర అంతటి ఫలమని భక్తుల విశ్వాసం. పురాణం అదే చెబుతోంది. ఇది విశేష పుణ్యక్షేత్రమని, కార్తీక మాసంలో ఎవరైతే సాలగ్రామ దర్శనం చేసుకుంటే అనేక జన్మల పాపాల పరిహారం, కోటి కన్యాదాన ఫలం లభిస్తుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.
మూసీనదిగా.. ముచుకుంద
మరోగాథ ప్రకారం.. విష్షు పురాణంలో ఈ క్షేత్రం శేషుని అంత్యభాగం గుర్తించారు. అంత్యభాగం అనంతం కనుక.. అనంతగిరి అని ప్రసిద్ధికెక్కింది. శేషుని శిరస్సు భాగం తిరుమల అని, మధ్య భాగం అహోబిలంగా, తోక భాగం అనంతగిరిగా మారిందని కథనం. మరో కథనం ప్రకారం.. ముచుకుందుడు అనే రాజు కాలయవ్వనుడు అనే రాక్షసునితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయాడు. తదనంతరం అతను ఇంద్రుని వద్దకు వెళ్లి.. నేను యుద్ధం చేసి అలసిపోయాను స్వామి. ఇక నేను నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్తాను అని అంటాడు. అలా అన్నప్పుడు స్వామి వారు ఇలా అంటారు. వెయ్యేళ్లు దాటింది కనుక ఇంకేమైనా వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు తనకు ప్రశాంతమైన వాతావరణం సూచించండి అని అడిగినపుడు అపుడు ఇంద్రుడు ఇలా చెప్పాడు. ‘నీవు శేషుని తోక భాగమయిన అనంతగిరి క్షేత్రానికి వెళ్లి నిద్రించు. నీకు ఎవరైతే నిద్ర భంగం కలిగిస్తారో.. వారిని నీవు చూస్తే భస్మీకృతం అవుతారు’ అనే వరం ఇచ్చాడు. ఈ క్షేత్రంలోనే ముచుకుంద మహారాజు నిద్రపోయి కాలయవ్వనుడు అనే రాక్షష సంహారం జరిగింది. కనుక ఇక్కడి నుంచే ముచుకుంద నది పుట్టింది. దీనికే కాలక్రమేణ మూసీనదిగా పేరు వచ్చింది. కాలయవ్వనుని సంహారం అనంతరం భగవంతుడు ముచుకుందునికి దర్శనం ఇచ్చి, ఏం వరం కావాలో అని కోరుకోమన్నపుడు.. సదా మీ పాద సేవ చేయాలని అని అన్నపుడు నదిగా మారు అని అనుగ్రహించాడు. అదే నది పూర్వం ముచుకుంద. అయితే కాలక్రమేనా.. వాడుకలో మూసీనదిగా మారిందని కథనం.
ఏర్పాట్లు ముమ్మరం
జాతర ఏర్పాట్లు ముమ్మరం చేశామని నిర్వాహకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించనున్నామని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామని వెళ్లడించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
అనంతగిరి జాతరకు వేళాయె..


