టార్పాలిన్లు అందవు..
● రాయితీపై పంపిణీ చేయని ప్రభుత్వం
● పదేళ్లుగా రైతుల ఎదురుచూపు
● పంటను కాపాడుకోలేక ఇక్కట్లు
● ప్రారంభమైన వరి కోతలు
కష్టాలు తీరవు
దోమ: టార్పాలిన్ల కోసం అన్నదాతలు పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అకాల వర్షం నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉపయోగించే కవర్లను ప్రభుత్వం అందించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కురుస్తున్న వానలతో కళ్లముందే తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకోలేని దీనస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు.
అధిక ధర వెచ్చించి..
వానాకాలం సీజన్‌లో జిల్లాలో లక్ష ఎకరాల్లో వరి, పత్తి, కంది, మొక్కజొన్నతో పాటు వివిధ పంటలను రైతులు సాగు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. టార్పాలిన్లు లేకపోవడంతో చేతికి వచ్చిన దిగుబడిని నీటిపాలు చేసుకుంటున్నారు. ధాన్యం బస్తాలు తడిసి, మొలకలు ఎత్తుతున్నాయని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గతంలో వ్యవసాయ, ఉద్యానశాఖ సమన్వయంతో రైతులకు రాయితీపై టార్పాలిన్లు పంపిణీ చేసేవారు. 250 జీఎస్‌ఎం నాణ్యత కలిగిన 8–6 మీటర్ల విస్తీర్ణం కవర్ల ధర రూ.2,500 ఉండగా.. 50 శాతం సబ్సిడీపై రూ.1,250కే అందజేసేవారు. కానీ 2017– 2018 ఏడాది నుంచి పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో టార్పాలిన్‌కు రూ.3,500 నుంచి రూ.8 వేల వెచ్చించికొనుగోలు చేస్తున్నారు.


