పట్టించుకోని అధికారులు
పసిగట్టేలోపే ప్రమాదం
ధారూరు: గుంతలు పడి ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్డుపై ఆదివారం ఉదయం కొందరు కర్రలు పాతి, దానికి ఎర్నని దుస్తును సూచికగా కట్టారు. అది ఓ వాహన ప్రమాదంలో ఎగిరిపోయింది. సోమవారం ఉదయం మళ్లీ అదే చోట కర్రలు పెట్టి, వాహనదారులు పక్క నుంచి వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఇదీమండల పరిధి కేరెళ్లి గ్రామ ఉన్నత పాఠశాల పక్కనే ఉన్న రోడ్డుపై నిత్యకృత్యంగా చోటుచేసుకుంటోంది. ఇది తాండూరు– హైదరాబాద్ ప్రధాన రోడ్డు కావడం, నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగుతుండటంతో ఈ మార్గంలో భారీగా గోతులు ఏర్పడ్డాయి. ఎలాంటి సూచికలు లేకపోవడంతో.. వీటిని పసిగట్టేలోపే వాహనదారులు ప్రమాదంలో పడుతున్నారు. అయినా ఈ రోడ్డు గురించి పట్టించుకునే వారే లేరని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తాండూరు– వికారాబాద్ వయా ధారూరు మీదుగా డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయిందని, అయినా పనులు ముందుకు సాగడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి, రోడ్డు మరమ్మతుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


