
అప్పులు తీరక!
● ఇబ్బందుల్లో నిర్మాణదారులు
● నిలిచిన మనఊరు– మనబడి నిధులు
● వడ్డీలు కట్టలేక వెతలు
● అధికారుల చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు
బిల్లులు రాక..
దోమ: ‘మనఊరు– మనబడి పథకం కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేశాం. కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. చిన్న బిల్లుల కోసం జిల్లా స్థాయి అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు’ అని పలువురు కాంట్రాక్టర్లుపేర్కొంటున్నారు.
64 పాఠశాలల ఎంపిక
దోమ, కుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో మనఊరు– మనబడి పథకం కింద 64 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. రూ.17 కోట్ల అంచనా వ్యయంతో ఆయా స్కూళ్లకు అదనపు తరగతి గదులు, ప్రహరీలు, భవనాలకు రంగులు, ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, డైనింగ్ హాల్, వంటగది తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొంటూ.. ప్రతిపాదనలను ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. అనంతరం ఆయా పనులను గతంలో కొంత మంది సర్పంచులు, స్కూల్ చైర్మన్లు, కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీటిలోకుల్కచర్ల, చౌడాపూర్ మండలాల్లో కొన్ని స్కూళ్లు, దోమ మండలంలో శివారెడ్డిపల్లి, బొంపల్లి తండా పాఠశాలలో పనులు పూర్తయ్యాయి. మరికొన్నింటిని బిల్లులు రాక కాంట్రాక్టర్లు మధ్యలోనేవదిలేసినట్లు సమాచారం.
కొడంగల్ మినహా..
జిల్లాలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమంత్రి కానిస్టెన్సీ అయిన కొడంగల్‌కు ఎంఓఎంబీ బిల్లులు చెల్లించినట్లు కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. మిగతా మూడు ప్రాంతాలకు ఇప్పటి వరకూ సరిగా బిల్లులు రాలేదని తెలిపారు.