
ఉపాధిహామీలో నిర్లక్ష్యం తగదు
● మస్టరులో హాజరు తప్పనిసరి
● డీఅర్‌డీఓ అసిస్టెంటు ప్రాజెక్టు
అధికారి సరళ
మోమిన్‌పేట: ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం తగదని డీఆర్‌డీఓ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి సరళ అన్నారు. మస్టరులో హాజరు సరిగా లేకపోవడం, ఒకరికి బదులు మరొకరు పనులు చేయడంతో ఫీల్డ్ అధికారులకు రూ.11 వేలు జరిమానా విధించామన్నారు. బుధవారం మండల కేంద్రం రైతువేదికలో 2024– 25 ఏడాదికి ఎన్‌అర్‌ఈజీఎస్ పనులకు 16వ విడత సామాజిక తనిఖీపై ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 29 గ్రామాల్లో నిర్వహించిన ఎన్‌అర్‌ఈజీఎస్ 527 పనుల్లో కూలీలకు చెల్లించిన మొత్తం రూ.9 కోట్ల 70లక్షల 70వేలు, మెటీరియలల్ చెల్లింపులకు రూ.15 లక్షల, 72వేలకు సామాజిక తనిఖీ చేశామని వివరిచారు. కూలీలు పనులు చేస్తుండగా క్లస్టరులో ఎన్‌ఎంఎంఎస్ ద్వారా వేసే హాజరు విషయంలో సాంకేతిక కారణాలను చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి పెనాల్టీ వేశామన్నారు. ఆదే విధంగా ఒక దగ్గర చేయాల్సిన పనికి ఇంకో దగ్గర చేయడం, జాబ్ కార్డులో ఉన్న సభ్యులలో ఒకరికి బదులు మరొకరు పనులకు హాజరు కావడం లాంటివి జరిగాయని, అందుకు గాను రూ.32,567లను రికవరీ చేయాల్సిందిగా ఆదేశించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సదానందం, ఇన్‌చార్జి ఎంపీడీఓ యాదగిరి, అంబుడ్స్‌మెన్ రాములు, విజిలెన్స్ వింగ్ భార్గవి, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.