
ఇద్దరు డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
గోల్కొండ: మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు టౌలిచౌకి పోలీసులతో కలిసి బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.బాలస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లోకల్ సబ్ ప్లెడర్స్ కదలికలపై పక్కా సమాచారంతో ఈ నెల 19న రాత్రి హెచ్‌ఎన్‌ఈడబ్ల్యూ పోలీసులు, టౌలిచౌకి పోలీసులతో కలిసి టౌలిచౌకి వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న మహ్మద్ ఇమ్రాన్ ఆలియాస్ షుకూర్, షేక్ బషీర్ అహ్మద్ ఆలియాస్ సమీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. సన్‌సిటీకి చెందిన మహ్మద్ ఇమ్రాన్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హుమాయూన్‌నగర్ చెందిన షేక్ బషీర్ అహ్మద్ వ్యాపారి. స్నేహితులైన వీరు ఇద్దరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. రెండేళ్లుగా మహ్మద్ ఇమ్రాన్ వివిధ ప్రాంతాల నుంచి గంజాయి, హష్ ఆయిల్ కొనుగోలు చేసి పరిచయస్తులకు విక్రయించేవాడు. గతంలో అతడిని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఇమ్రాన్ తన పద్ధతి మార్చుకోలేదు. జల్సాలకు అలవాటు పడిన అతను మళ్లీ మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నాడు. నాంపల్లి, టౌలిచౌకి, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో ఎండీఎంఏ, ఎల్‌ఎల్‌డీ బ్లాట్స్ క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో విక్రయించేవాడు. ఈ క్రమంలో అతడికి హుమాయున్‌నగర్‌కు చెందిన షేక్ బషీర్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. అతను మహ్మద్ ఇమ్రాన్ నుంచి గంజాయి, యాష్ ఆయిల్, ఎండీఎంఏ కొనుగోలు చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వినియోగదారులకు సరఫరా చేసేవాడు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 13 ఎండీఏఎం, రెండు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.